హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉందా? ఇలా చేస్తే మరింత బెటర్‌!

Sakshi Special Story About Health Insurance policies For Coronavirus

కంపెనీలపై కరోనా క్లెయిమ్‌ల భారం

దీంతో పెరగనున్న ప్రీమియంలు

ఇప్పటికే పలు కంపెనీల సవరణ

ప్రీమియం తగ్గింపునకు ఎన్నో మార్గాలు

బేసిక్‌ పాలసీని తక్కువకు తీసుకోవాలి

టాపప్, సూపర్‌ టాపప్‌ల ప్రయోజనం

శారీరకంగా ఫిట్‌గా ఉంటే రాయితీలు

వాటిని ప్రీమియంతో సర్దుబాటుకు వీలు

పాలసీ పోర్టింగ్‌తోనూ ఆదా

కరోనా క్లెయిమ్‌ల రూపంలో రానున్న రెండు మూడు నెలల్లో బీమా సంస్థలు పెద్ద మొత్తాలే చెల్లించుకోవాల్సి రావచ్చని అంచనా. ఈ భారాన్ని దింపుకునేందుకుగాను ఆరోగ్య బీమా ప్రీమియంను ఇప్పటికే పలు కంపెనీలు పెంచగా.. మిగిలినవీ అతి త్వరలోనే వడ్డించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సామాన్యులకు బీమా ప్రీమియం భారంగా మారింది. రానున్న రోజుల్లో వడ్డనలతో ఆ భారం మరికాస్త పెరగనుంది. ఇందుకు పాలసీదారులు సిద్ధం కావాల్సిందే.

సాధారణంగా ప్రతీ నాలుగేళ్లకు ఒక పర్యాయం తమ ఖర్చులు, వైద్య ద్రవ్యోల్బణం (చికిత్సల వ్యయాలు పెరగడం), ఇతర అంశాల ఆధారంగా ఆరోగ్య బీమా ప్లాన్‌ల ప్రీమియంలను సవరించేందుకు బీమా కంపెనీలకు అనుమతి ఉంది. సవరణ తర్వాత ప్రస్తుత పాలసీదారులపై ఆ మేరకు పెంపును అమలు చేయడంతోపాటు, కొత్త పాలసీలను ప్రవేశపెడుతుంటాయి. పాలసీదారుల వయసు, ఆరోగ్య సమస్యలు, క్లెయిమ్‌ల చరిత్ర ఈ అంశాలన్నీ నాలుగేళ్లకోసారి ప్రీమియం సవరణలో కీలక పాత్ర పోషించే ఇతర అంశాలు. మొత్తానికి ప్రీమియం భారంగా మారితే.. పాలసీదారుల ముందు పలు మార్గాలున్నాయి. ప్రీమియం తగ్గించుకునేందుకు వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి ఉపయోగకరంగా ఉండొచ్చు..

టాపప్‌ చేసుకోవడం..
ఆరోగ్య బీమా ప్రీమియంను తగ్గించుకునే మార్గాల్లో.. బేసిక్‌ పాలసీకి బూస్టర్‌ ప్లాన్‌ను జోడించుకోవడం ఒకటి. టాపప్, సూపర్‌ టాపప్‌ పేరుతో ఉండే ప్లాన్‌ను బేసిక్‌ ప్లాన్‌కు తోడుగా తీసుకోవచ్చు. ‘‘మీకు బేసిక్‌ ప్లాన్‌ ఉండి.. కవరేజీని మరింత పెంచుకునేందుకు మరో బేసిక్‌ ప్లాన్‌ను తీసుకుంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు బేసిక్, బూస్టర్‌ ప్లాన్‌ను కలిపి తీసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది’’ అని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో ప్రసూన్‌ సిక్దర్‌ సూచించారు.

ఈ విధానంలో ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో ఇండెమ్నిటీ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. అలాగే, మరో రూ.5 లక్షలకు టాపప్‌ ప్లాన్‌ను దీనికి అదనంగా తీసుకున్నారని అనుకుంటే.. ఆస్పత్రిలో చేరి చికిత్సా వ్యయం రూ.5 లక్షలు దాటిపోయిన సందర్భంలో టాపప్‌ ప్లాన్‌ అక్కరకు వస్తుంది. క్లెయిమ్‌ రూ.5 లక్షల వరకు బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ నుంచే చేసుకోవాలి. రూ.5 లక్షలు మించిపోయిన సందర్భాల్లోనే టాపప్‌ ఫోర్స్‌లోకి వస్తుంది. కానీ, బేసిక్‌ పాలసీకి, టాపప్‌ ప్లాన్‌కు మధ్య ప్రీమియం వ్యత్యాసం ఎంతో ఉంటుంది.

ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల హెల్త్‌ కవరేజీకి కోసం ప్రీమియం రూ.6,621గా ఉంటే.. మరో రూ.5లక్షలకు మరో కంపెనీ నుంచి బేసిక్‌ ప్లాన్‌ తీసుకోవాలంటే ప్రీమియం రూపంలో మొత్తం మీద రూ.10 లక్షల కవరేజీకి రూ.13,242 చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు టాపప్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే రెండింటికీ కలిపి చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,156 అవుతుంది. ఇందులో సూపర్‌ టాపప్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. బేసిక్‌ ప్లాన్, టాపప్‌ ప్లాన్‌ కుడా చాలని వారు సూపర్‌ టాపప్‌తో కవరేజీని మరింత పెంచుకోవచ్చు.
   
‘‘ఈ తరహా హెల్త్‌ కవరేజీ ప్లాన్ల కలయికతో ఉంటే.. అవయవ మార్పిడి లేదా శస్త్రచికిత్సల వంటి సందర్భాల్లో మంచిగా ఉపయోగపడుతుంది’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్‌ అండర్‌రైటింగ్‌ క్లెయిమ్స్‌ చీఫ్‌ సంజయ్‌దత్తా పేర్కొన్నారు. బేసిక్‌ ప్లాన్‌ రూ.5–10 లక్షలు కలిగిన వారు.. అదనంగా రూ.10 లక్షల నుంచి టాపప్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం నేటి పరిస్థితుల్లో కొంచెం అర్థవంతంగా ఉంటుందని నిపుణుల సూచన. ఇక్కడ టాపప్‌కు, సూపర్‌ టాపప్‌కు మధ్య వ్యత్యాసం ఉంది.

టాపప్‌లో రూ.5–10 లక్షలు డిడక్టబుల్‌ (మినహాయింపు) ఉందనుకుంటే.. బిల్లు రూ.5–10 లక్షలు దాటిన సందర్భాల్లోనే టాపప్‌ అక్కరకు వస్తుంది. సూపర్‌ టాపప్‌ అలా కాదు. ఒక ఏడాదిలో ఒక వ్యక్తి మూడు సార్లు ఆస్పత్రిలో చేరాల్చి వచ్చి మొత్తం రూ.13లక్షలు బిల్లు అయ్యిందనుకుందాం. అప్పుడు రూ.13 లక్షల నుంచి డిడక్టబుల్‌ రూ.5–10 లక్షలు అమలవుతుంది. మిగిలిన మొత్తాన్ని సూపర్‌ టాపప్‌ నుంచి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అందుకే టాపప్‌తో పోలిస్తే సూపర్‌ టాపప్‌ ప్రీమియం కాస్త ఎక్కువ.

కో–పే, డిడక్టబుల్‌
కో–పే, డిడక్టబుల్‌(నిర్ణీత శాతం మేర మినహాయించి) ఆప్షన్లు హెల్త్‌ ప్లాన్లలో సాధారణంగా అందుబాటులో ఉంటుంటాయి. కో–పే అంటే సహ చెల్లింపు అని. ప్రతీ క్లెయిమ్‌లోనూ పాలసీదారు నిర్ణీత శాతాన్ని కో–పే కింద భరించాల్సి వస్తుంది. అప్పుడు మిగిలిన శాతం మేర బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఈ కో–పే 10–30 శాతం మధ్య ఉంటుంది. కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.30 ఏళ్ల వ్యక్తికి కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రూ.5 లక్షలకు ప్రీమియం రూ.7,283. 20 శాతం కో–పే ఎంపిక చేసుకుంటే ఇదే వ్యక్తికి ప్రీమియం రూ.6,548 అవుతుంది.

ప్రీమియం రూ.735 తగ్గింది. ‘‘కో–పే అన్నది క్లెయిమ్‌లో నిర్ణీత శాతం మేర ఉంటుంది. పాలసీదారు తన జేబు నుంచి నిర్ణీత శాతం మేర చెల్లించిన తర్వాతే బీమా సంస్థ మిగిలిన మేర చెల్లిస్తుంది’’ అని పాలసీబజార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగం చీఫ్‌ అమిత్‌ ఛబ్ర తెలిపారు. ఉదాహరణకు రూ.5 లక్షల ప్లాన్‌లో 20 శాతం కోపే కింద ఎంపిక చేసుకున్నారనుకుంటే.. ఆస్పత్రిలో బిల్లు రూ.2లక్షలు అయ్యిందనుకోండి.. అప్పుడు పాలసీదారు 20 శాతం కింద రూ.40,000ను స్వయంగా భరించాలి. మిగిలిన రూ.1.60 లక్షలను నిబంధనలకులోబడి బీమా సంస్థ చెల్లిస్తుంది. ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లోనే కో–పే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వెల్‌నెస్‌ రాయితీలు
పాలసీదారులకు ఆరోగ్యకరమైన జీవనంపై బీమా సంస్థలు పలు ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. రివార్డులు, ప్రీమియంలో రాయితీలను పాలసీదారులు పొందొచ్చు. ఇలా కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ యాక్టివ్‌ హెల్త్‌ ప్లాన్‌ అయితే 100 శాతం ప్రీమియాన్ని రివార్డులతో సర్దుబాటును ఆఫర్‌ చేస్తోంది. పాలసీదారులు రోజూ ఎన్ని అడుగులు నడిస్తే అంత మేరకు రివార్డులను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

‘యాక్టివ్‌డేజ్‌’ కార్యక్రమం కింద ఆదిత్య బిర్లా హెల్త్‌ యాక్టివ్‌ ప్లాన్‌లో రోజూ 10,000 అడుగులు నడిచినా లేదా 30 నిమిషాలు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి 300 కేలరీలను కరిగించుకుంటే గణనీయమైన హెల్త్‌ రివార్డులను పోగు చేసుకోవచ్చు. ఈ రివార్డులను ప్రీమియం చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు. ప్రీమియం భారం చాలా వరకు తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోకీ ఇదే అత్యుత్తమైనది. మ్యాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రీఅష్యూర్‌ ప్లాన్‌ కూడా ఇదే తరహా రివార్డులను ఆఫర్‌ చేస్తోంది.

రోజూ ఎన్ని అడుగుల మేర నడిచారన్న దాని ఆధారంగా రివార్డులు సమకూర్చుకుని.. ప్రీమియంలో గరిష్టంగా 30 శాతం తగ్గింపులను ఈ పాలసీలో పొందడానికి అవకాశం ఉంది. ఇందుకోసం బీమా సంస్థకు చెందిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అదే విధంగా ఫార్మసీ కొనుగోళ్లపై తగ్గింపులు, ఉచిత వైద్యుల సంప్రదింపులు, హెల్త్‌ చెకప్‌లను కూడా ఈ ప్లాన్‌ ఆఫర్‌ చేస్తోంది. ‘‘చాలా వరకు బీమా సంస్థలు ఇప్పుడు జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు సమస్యల ఆధారంగా అండర్‌రైటింగ్‌ పాలసీని పాటిస్తున్నాయి. దీంతో ఆరోగ్యంగా ఉండే పాలసీదారు అధిక ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు’’ అని టాటాఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పరాగ్‌వేద్‌ తెలిపారు.

కుటుంబ పాలసీ
ఎవరికివారు విడిగా కవరేజీ తీసుకోకుండా ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను తీసుకోవడం వల్ల ప్రీమియం భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఒకే ప్లాన్‌లో రెండు, అంతకుమించి సభ్యులు ఉంటే బీమా సంస్థలు ప్రీమియంలో 15 శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నాయి. ‘‘ఎక్కువ మంది కుటుంబ సభ్యులను చేర్చడం వల్ల బీమా సంస్థలకు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. దీంతో తగ్గిన మేర పాలసీదారులకు ప్రయోజనాలను బదిలీ చేయడం జరుగుతుంది’’ అని టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన వేద్‌ తెలిపారు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు కలిపి ఒకే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను తీసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. కానీ, అదే ప్లాన్‌లో వృద్ధులైన తల్లిదండ్రులను సభ్యులుగా చేర్చవద్దు.

దీనివల్ల ప్రీమియం తగ్గకపోగా భారీగా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రీమియం అన్నది ప్లాన్‌లో ఎక్కువ వయసున్న వ్యక్తి ఆధారంగా నిర్ణయమవుతుంది. వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ఇండివిడ్యువల్‌ ప్లాన్‌లను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. కుటుంబ సభ్యులు అందరూ ఒకే విడత ఆస్పత్రిలో చేరడం అన్నది చాలా అరుదు. కనుక ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అన్నది చాలా మందికి సరిపోతుంది. పైగా చాలా బీమా కంపెనీలు నేడు రీస్టోరేషన్‌ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. అంటే ఏడాదిలో కనీసం ఒక పర్యాయం బీమా కవరేజీ పూర్తిగా అయిపోతే తిరిగి అంతే కవరేజీని పునరుద్ధరిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు అయితే పాక్షికంగా కవరేజీని వినియోగించుకున్నా కానీ పూర్తిస్థాయి కవరేజీని రీస్టోర్‌ చేస్తుండడాన్ని గమనించాలి.

గ్రూపు ప్లాన్‌లో తక్కువ
గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను కూడా బీమా కంపెనీలు ఆఫర్‌ చేస్తుంటాయి. సాధారణంగా కార్పొరేట్‌ టైఅప్‌లో భాగంగా వీటిని ఇస్తుంటాయి. ఇలాంటివి ఎంపిక చేసుకోవడం వల్ల స్టాండలోన్‌ ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ కంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్‌ ప్లాన్లలో ఎక్కువ మంది సభ్యులుగా ఉంటారు. కనుక మొత్తం సభ్యులపై ప్రీమియం భారం సమానంగా ఉంటుంది.

రెండు మూడేళ్లకు ఒకేసారి..
ఒకే విడత రెండు, మూడేళ్లకు కలిపి ప్రీమియం చెల్లించడం ద్వారా కొంత ఆదా చేసుకోవచ్చు. ఇలా ఒకే పర్యాయం రెండు మూడేళ్ల చెల్లింపులపై 7.5–15 శాతం మధ్య బీమా సంస్థలు తగ్గింపునిస్తున్నాయి. కాకపోతే బీమా సంస్థ సేవలు, తీసుకున్న పాలసీలోని సదుపాయాల పట్ల మీకు సంతృప్తి అనిపిస్తేనే ఇలా మల్టీ ఇయర్‌ ఆప్షన్‌ తీసుకోవడం సరైనది అవుతుంది. ‘‘ఒకే సారి అధిక ప్రీమియం చెల్లింపులపై బీమా సంస్థ వడ్డీ ఆదాయం సమకూర్చుకుంటుంది. దీన్నే పాలసీదారులకు తగ్గింపు రూపంలో ఆఫర్‌ చేస్తుంది’’ అని ఛాబ్రా తెలిపారు.

‘‘గతంలో ఇలా ఒకే సారి ఎక్కువ సంవత్సరాలకు ప్రీమియం చెల్లింపులపై ఒకటికి మించిన సంవత్సరాల్లో పన్ను ఆదాకు అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ప్రీమియం చెల్లింపులను ఆయా సంవత్సరాల మధ్య వేరు చేసి క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది’’అని మిశ్రా పేర్కొన్నారు. పైగా పాలసీ ప్రీమియం భారాన్ని ఈ విధానంలో కొంత కాలం పాటు వాయిదా వేసుకునేందుకు అవకాశం ఉంటుందని సిక్దర్‌ వివరించారు. ‘‘ఒక వ్యక్తి మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించారనుకోండి. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రీమియం పెంపు ఉంటుంది. దీంతో ఈ పెంపునకు ముందే తిరిగి మూడేళ్లకు ఒకే సారి ప్రీమియం చెల్లించడం వల్ల రెండేళ్ల పాటు ప్రీమియం భారం పడకుండా చూసుకోవచ్చు’’ అని సిక్దర్‌ తెలిపారు.

నోక్లెయిమ్‌ బోనస్‌ల వినియోగం
కంపెనీలు ఒక ఏడాది లో ఎటువంటి క్లెయిమ్‌ లేకపోతే నో క్లెయిమ్‌ బోనస్‌ను ఆఫర్‌ చేస్తుంటాయి. క్యుములేటివ్‌ బోనస్‌ ఆప్షన్‌లో బీమా కవరేజీ పెరుగుతుంది. మరో విధానంలో బోనస్‌ కింద బీమా కవరేజీని పెంచకుండా ప్రీమియంలో తగ్గింపులను ఆఫర్‌ చేస్తున్నవీ ఉన్నాయి. తగ్గింపు అయితే 20–50 శాతం మధ్య ఉంటుంది. ఫ్యూచర్‌ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ.. పాలసీదారు మొదటి కొన్నేళ్లలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోతే ఆ తర్వాత రెన్యువల్‌ ప్రీమియంలో 80% వరకు తగ్గింపు ఇస్తోంది. హెల్త్‌ సూపర్‌సేవర్‌ 1ఎక్స్, 2ఎక్స్‌ ప్లాన్ల రూపంలో ఇది అందుబాటులో ఉంది. క్యుములేటివ్‌ బోనస్‌ కింద బీమా సంస్థలు 10% నుంచి 100% వరకు బీమా కవ రేజీ (సమ్‌ ఇన్సూరెన్స్‌)ని పెంచుతున్నాయి.

చౌక పాలసీకి మారడమే
చివరిగా ఉన్న మార్గం.. చౌక ప్రీమియంతో కూడిన పాలసీకి మారిపోవడం. మీరు పాలసీ ఎంపిక చేసుకున్న సమయంలో ప్రీమియం సరసంగానే అనిపించి ఉండొచ్చు. కానీ, కొన్నేళ్ల తర్వాత కంపెనీ ఆఫర్‌ చేస్తున్న సేవలతో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉందనిపిస్తే.. తొలుత తక్కువకు ఆఫర్‌ చేసి, తర్వాత ప్రీమియం పెంచడం వల్ల భారంగా అనిపించినప్పుడు మార్కెట్లో మెరుగైన ఇతర ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు.

ప్రీమియం భారం తగ్గించుకునేందుకు ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడొద్దు. ఇప్పటికే ఉన్న పాలసీలో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా కొత్తగా ఎంపిక చేసుకున్న ప్లాన్‌లోనూ ఉండాలి. ఇంకా అదనపు ప్రయోజనాలతో కూడిన పాలసీ తక్కువ ప్రీమియంతో వస్తుంటే పోర్ట్‌ పెట్టేసుకుని ఆ కంపెనీకి మారిపోవచ్చు. రూమ్‌రెంట్‌ లిమిట్‌ అన్నది ప్రస్తుత పాలసీలో ఉందనుకోండి. పాలసీ తీసుకుని ఇప్పటికే 5–10 ఏళ్లు అయి ఉంటే.. ఈ నిబంధన ఇక మీదట ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు.

రూమ్‌మెంట్‌ క్యాప్‌ను సమ్‌ ఇన్సూరెన్స్‌లో 1 శాతంగా కంపెనీలు అమలు చేస్తున్నాయి. దీంతో రూ.5లక్షల పాలసీ కలిగిన వారు ఆస్పత్రిలో చేరితే రూ.5,000కు మించిన రూమ్‌లో చేరినట్టయితే పెరిగిన మేర పాలసీదారే తన జేబు నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆస్పత్రుల్లో చార్జీలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ తరహా నిబంధనలు కలిగిన పాలసీల నుంచి మెరుగైన పాలసీలోకి మారిపోవడం కూడా ప్రయోజనకరమేనని మర్చిపోవద్దు. గత కొన్నేళ్లలో చాలా కంపెనీలు ప్రీమియంలను భారీగా పెంచేశాయి. కానీ, సేవలు, ప్రయోజనాల విషయంలో అంత మెరుగుదల లేదు. కనుక ఈ పాలసీల నుంచి మారిపోవడాన్ని కూడా పరిశీలించొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top