రష్యా వ్యాక్సిన్‌ వయా డాక్టర్‌ రెడ్డీస్‌

Russia To Sell 100 Million Doses Of Sputnik-V Vaccine To Dr Reddys Lab - Sakshi

ఈ ఏడాదే  స్పుత్నిక్‌–వి అందుబాటులోకి...

ఆర్‌డీఐఎఫ్, డాక్టర్‌ రెడ్డీస్‌ జట్టు

దేశంలో మూడో దశ ఔషధ పరీక్షలు

భారత్‌కు 10 కోట్ల డోసుల సరఫరాకు ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై  హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్‌ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్‌ బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయ నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

నమ్మదగిన ఎంపిక...
రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్‌ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని ఆర్‌డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హ్యూమన్‌ ఎడినోవైరస్‌ డ్యూయల్‌ వెక్టర్‌ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని వివరించారు. వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్‌ అన్నారు. మొదటి, రెండవ దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తు చేశారు. భద్రత, సమర్థత తెలుసుకునేందుకు, అలాగే భారత నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మూడవ దశ ఔషధ పరీక్షలు దేశంలో జరుపనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో కోవిడ్‌–19పై పోరులో స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ నమ్మదగిన ఎంపిక అని చెప్పారు.

ఈ ఏడాది చివరిలో భారత్‌లో టీకా సరఫరా జరగవచ్చునని, మానవ ప్రయోగాలు వచ్చే నెల నుంచి మొదలుకావచ్చునని ఆర్డీఐఎఫ్‌ అధ్యక్షుడు దిమిత్రీవ్‌ రాయిటర్స్‌తో మాట్లాడుతూ చెప్పారు.  ప్రయోగాల ఫలితాల ఆధారంగా భారత్‌లో టీకా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. స్పుత్నిక్‌–విపై ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మందిపై మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటి ఫలితాలు అక్టోబర్‌/నవంబర్‌ నెలల్లో తెలిసే అవకాశం ఉంది. వయో వృద్ధులు, కోవిడ్‌–19 బారిన పడేందుకు అవకాశమున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్‌–వి టీకా అందించే ఆలోచన చేస్తున్నట్లు భారత్‌ గత వారమే తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా టీకాపై ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలు మెరుగైన పలితాలే ఇచ్చినట్లు  మెడికల్‌ జర్నల్‌ ద లాన్‌సెట్‌ ఇటీవలే స్పష్టం చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

దూసుకెళ్లిన షేరు..
రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో  రెడ్డీస్‌ షేరు ధర దూసుకెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం షేరు ధర బీఎస్‌ఈలో 4.24 శాతం అధికమై రూ.4,631.55 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర 4.69 శాతం ఎగసి రూ.4,651.95 వరకు వెళ్లింది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 4.17 శాతం అధికమై రూ.4,442.35 వద్ద స్థిరపడింది.

మళ్లీ మొదలైన ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు
కరోనా కట్టడికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలు భారత్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాల తరఫున భారత్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఐఐ) నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలకు అనుమతి ఇస్తూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) డాక్టర్‌. వి.జి.సోమాని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకున్న ఓ యూకే మహిళ అస్వస్థతకు గురైన నేపథ్యంలో  సెప్టెంబ ర్‌ 11న ప్రయోగాలపై తాత్కాలిక నిషేధం విధించడం తెలిసిందే. అనారోగ్యానికి గురైన మహిళ సమాచారాన్ని మొత్తం సమీక్షించిన తరువాత యూకేలోనూ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు అనుమతి లభించగా.. డీసీజీఐ కొన్ని నిబంధనలతో టీకాలు చేపట్టవచ్చునని సీఐఐకు ఆదేశాలు ఇచ్చారు. సీఐఐ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారమే డీసీజీఐకి అందించగా అదే రోజుల ప్రయోగాల పునరుద్ధరణకు ఆదేశాలూ జారీ అయ్యాయి. కాకపోతే మరింత క్షుణ్ణంగా పరిశీలించాకే టీకా ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తల అనుమతి పత్రాల్లో కొన్ని మార్పులు సూచించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top