పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త!

Published Tue, Mar 14 2023 3:43 AM

Risky penny stocks fly again as investors look for quick gains - Sakshi

ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్‌ మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్‌ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్‌ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మిడ్‌ క్యాప్‌ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్‌ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం..

ముంబై: సాధారణంగా స్టాక్‌ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్‌లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్‌ అంతంత మాత్ర బిజినెస్‌లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతాయి.

అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్‌ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్‌ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్‌లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ తీరు
గతేడాది నవంబర్‌ నుంచి సాఫ్ట్రాక్‌ వెంచర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్‌ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్‌ షేరు 1,823 శాతం జంప్‌చేసింది.

గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్‌ ఇండస్ట్రీస్‌ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్‌ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది.

ఇన్వెస్టర్ల కన్ను
కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్‌ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్‌ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్‌ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు.

సాధనా బ్రాడ్‌క్యాస్ట్, షార్ప్‌లైన్‌ బ్రాడ్‌క్యాస్ట్‌ యూట్యూబ్‌ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్‌అండ్‌టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్‌ఆర్‌ రైల్‌ ఇంజినీరింగ్, టేలర్‌మేడ్‌ రీన్యూ, ఆస్కమ్‌ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్‌ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!!

Advertisement
 
Advertisement
 
Advertisement