కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!

Risky Debt To Increase By Rs 60,000 Cr In Fy23 - Sakshi

ముంబై: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్‌బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్‌) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. 

కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్‌గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్‌ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్‌ విశ్లేషించింది.

 యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top