సెప్టెంబర్‌లో 5.54 శాతానికి అప్
టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
న్యూఢిల్లీ: ఉల్లి, ఇతర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతూ ఉండటంతో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ (సీపీఐ) సెప్టెంబర్‌లో 5.54 శాతానికి ఎగిసింది. ఆగస్టులో ఇది 4.83 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటా ప్రకారం సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 5.97 శాతం నుంచి 7.74 శాతానికి పెరిగింది.
ఇందులో అత్యధికంగా పెరిగిన టాప్ 5 ఐటమ్స్ చూస్తే ఉల్లి (108.9 శాతం), వెండి ఆభరణాలు (87.8 శాతం), అల్లం (62.85 శాతం), వెల్లుల్లి (54.62 శాతం), నిమ్మ (36.41 శాతం) ఉన్నాయి. మరోవైపు, బంగాళదుంప, టమాటాలు, కొబ్బరికాయలు మొదలైన వాటి ధరల పెరుగుదల గణనీయంగా పడిపోయింది.
ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. మిజోరంలో అత్యంత తక్కువగా ఉంది. 2024 బేస్ ఇయర్‌గా జనవరి నుంచి ప్రకటిస్తున్న ద్రవ్యోల్బణం కొత్త సిరీస్‌లో సెప్టెంబర్ గణాంకాలు అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ద్రవ్యోల్బణ స్థాయిని 4 శాతానికి (రెండు శాతం అటూఇటుగా) కట్టడి చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ని కేంద్రం నిర్దేశించిన సంగతి తెలిసిందే. ధరల పెరుగుదలకు కళ్లెం వేసేలా ఆర్‌బీఐ ఇటీవలే ప్రామాణిక వడ్డీ రేటును (రెపో రేటును) దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పావు శాతం పెంచడంతో అది 5.50 శాతానికి చేరింది.


