ఎలక్ట్రానిక్‌ రంగంలోకి ఆర్‌ఐఎల్‌

Reliance-Sanmina JV to build electronics manufacturing hub in India - Sakshi

సాన్మినా కార్పొరేషన్‌తో భాగస్వామ్యం

అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందం

రూ. 1,670 కోట్ల వరకూ పెట్టుబడులు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తాజాగా ఎలక్ట్రానిక్‌ తయారీలోకి ప్రవేశించింది. ఇందుకు వీలుగా అనుబంధ సంస్థ రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌బీవీఎల్‌) ద్వారా సాన్మినా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. ప్రధానంగా కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్కింగ్, రక్షణ, ఏరోస్పేస్‌ తదితర హైటెక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హార్డ్‌వేర్‌పై దృష్టిపెట్టనున్నాయి.

భాగస్వామ్య సంస్థ(జేవీ)లో ఆర్‌ఎస్‌బీవీఎల్‌ 50.1 శాతం వాటా పొందనుండగా.. సాన్మినాకు 49.9 శాతం వాటా లభించనుంది. సాన్మినాకు దేశీయంగా గల సంస్థలో ఆర్‌ఎస్‌బీవీఎల్‌ రూ. 1,670 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనుంది. తద్వారా జేవీలో వాటాను పొందనుంది. ఈ పెట్టుబడితో లభించనున్న 20 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1,500 కోట్లు) నగదుతో వృద్ధి అవకాశాలను జేవీ అందిపుచ్చుకోనుంది. కాగా.. ఈ లావాదేవీకి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. సాన్మినా కార్పొరేషన్, ఆర్‌ఎస్‌బీవీఎల్‌ సంయుక్తంగా వెల్లడించిన ఈ డీల్‌ 2022 సెప్టెంబర్‌కల్లా పూర్తికాగలదని అంచనా.  

సాన్మినా నిర్వహణలో
చెన్నైలోగల సాన్మినా యాజమాన్యం జేవీకి చెందిన రోజువారీ బిజినెస్‌ కార్యకలాపాలను నిర్వహించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత సాంకేతికతగల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హార్డ్‌వేర్‌ తయారీకి ప్రాధాన్యత ఇవ్వనుంది. 5జీ, క్లౌడ్‌ ఇన్‌ఫ్రా, హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు తదితర కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్కింగ్, మెడికల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్స్, ఇండస్ట్రియల్‌ క్లీన్‌టెక్, డిఫెన్స్, ఏరోస్పేస్‌ తదితర వృద్ధికి వీలున్న కీలక రంగాలపై దృష్టి పెట్టనుంది.

దేశీయంగా హైటెక్‌ తయారీకున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో సాన్మినాతో కలసి పనిచేయడానికి సంతోషిస్తున్నట్లు రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వృద్ధి, భద్రతరీత్యా టెలికం, ఐటీ, డేటా సెంటర్లు, 5జీ, నూతన ఇంధన రంగాలకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీలో స్వయం సమృద్ధి సాధించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా దేశ, విదేశాలలో నెలకొన్న డిమాండుకు అనుగుణమైన కొత్త ఆవిష్కరణలు, ప్రతిభలకు ప్రోత్సాహం లభించగలదని తెలియజేశారు. మేకిన్‌ ఇండియా విజన్‌కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్‌ తయారీ కేంద్ర సృష్టి ఈ జేవీ లక్ష్యమని పేర్కొన్నారు.  

తొలుత చెన్నైలో...
2021 మార్చితో ముగిసిన ఏడాదిలో సాన్మి నా దేశీ యూనిట్‌.. సాన్మినా ఎస్‌సీఐ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ 16.5 కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,230 కోట్లు) ఆదాయం సాధించింది. ఎలక్ట్రానిక్‌ తయారీని తొలుత పూర్తిగా సాన్మినాకు చెన్నైలోగల 100 ఎకరాల క్యాంపస్‌లోనే చేపట్టనున్నట్లు ఆర్‌ఎస్‌బీవీఎల్‌ వెల్లడించింది. భవిష్యత్‌ విస్తరణకు సైతం ఇక్కడ వీలున్నట్లు తెలియజేసింది. ఆపై వ్యాపార అవసరాలరీత్యా దేశంలోని ఇతర ప్రాంతాలలో యూనిట్ల ఏర్పాటుకు వీలున్నట్లు వివరించింది. దేశీయంగా సమీకృత తయారీ సొల్యూషన్స్‌ కంపెనీ ఏర్పాటు కోసం రిలయన్స్‌తో జత కట్టడం తమకు ఉత్తేజాన్నిస్తున్నట్లు సాన్మినా చైర్మన్, సీఈవో జ్యూరె సోలా పేర్కొన్నారు. ఈ జేవీ దేశ, విదేశీ మార్కెట్లకు అవసరమైన ఉత్పత్తులను రూపొందించగలదని తెలియజేశారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో కీలక మైలురాయిగా నిలవగలదని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top