రిలయన్స్, సౌదీ ఆరామ్‌కో డీల్‌ రద్దు

Reliance Industries- Saudi Aramco deal canceled - Sakshi

పెట్రో వ్యాపారంలో పెట్టుబడులపై మరోసారి మదింపు

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రోకెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంలో సౌదీ ఆరామ్‌కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్‌ రద్దయింది. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని విలువను మరోసారి మదింపు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించుకున్నాయి. ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్‌కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్‌ (ఆర్‌ఐఎల్‌) ఒక ప్రకటనలో తెలిపింది.  2019 ఆగస్టులో రిలయన్స్‌ తమ ఓ2సీ వ్యాపారం విలువను 75 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టింది. దీన్ని ప్రత్యేక విభాగంగా కూడా విడగొట్టాలని భావించింది. నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్‌కో సంస్థకు 15 బిలియన్‌ డాలర్లకు 20 శాతం వాటాలు విక్రయించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇందుకు ముందుగా 2020 మార్చి డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తి కాగలదని ప్రకటించింది. అయితే, ఈలోగా పర్యావరణ హిత ఇంధనాల ఉత్పత్తి దిశగా కంపెనీ కొత్తగా భారీ ప్రణాళికలు ప్రారంభించడం, క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఓ2సీని ప్రత్యేక విభాగంగా విడగొట్టే ప్రతిపాదనను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి రిలయన్స్‌ వెనక్కి తీసుకుంది. ఈ అంశాల నేపథ్యంలో తాజాగా రిలయన్స్‌ ఓ2సీ విభాగంలో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడుల ప్రతిపాదన రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రిలయన్స్‌ బ్రాండ్స్‌తో వెస్ట్‌ ఎల్మ్‌ జట్టు..
ఫర్నిచర్, హోమ్‌ డెకరేషన్‌ ఉత్పత్తుల సంస్థ వెస్ట్‌ ఎల్మ్‌ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించింది. ఇందుకోసం రిలయన్స్‌ బ్రాండ్స్‌తో చేతులు కలిపింది. జియో వరల్డ్‌ డ్రైవ్‌లో తొలి స్టోర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించగా, గత వారం రెండో స్టోర్‌ను గుర్గావ్‌లో ఆరంభించింది. అటు ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆశీష్‌ షాతో కూడా జట్టు కట్టింది. రిలయన్స్‌ బ్రాండ్స్‌ ఇప్పటికే దాదాపు 35 అంతర్జాతీయ బ్రాండ్స్‌ను దేశీ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టైల్స్‌లో 40 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top