రిలయన్స్‌ అదరహో!

Reliance Industries Q2 net profit jumps 43percent to Rs 13680 crore - Sakshi

క్యూ2లో నికర లాభం

రూ. 13,680 కోట్లు; 43% జూమ్‌

ఆదాయం రూ. 1,91,532 కోట్లు

సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి పటిష్ట పనితీరు చూపింది. ముడిచమురు ధరలు పుంజుకోవడంతో ఓటూసీ విభాగం జోరు చూపగా.. టెలికం, డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ యథాప్రకారం మెరుగైన లాభాలను సాధించింది. ఇక రిలయన్స్‌ రిటైల్‌ సైతం అమ్మకాలను పెంచుకుంది. వివరాలు ఇలా...  

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసింది. రూ. 13,680 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ, 9,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం 49 శాతం పురోగమించి రూ. 1,91,532 కోట్లకు చేరింది. చమురు ధరలు భారీగా పెరగడంతో కంపెనీ లబ్ధి పొందింది. దీనికితోడు రిటైల్‌ బిజినెస్‌ జోరందుకోవడం, టెలికం బిజినెస్‌ పుంజుకోవడం సైతం లాభాలకు దోహదపడ్డాయి. కంపెనీ ప్రధానంగా 4 బిజినెస్‌ విభాగాలను కలిగి ఉంది. ఇవి ఆయిల్‌ టు కెమికల్‌(ఓటూసీ), రిటైల్, డిజిటల్‌ సర్వీసులు, కొత్త ఇంధన బిజినెస్‌.

విభాగాల వారీగా..
ఆర్‌ఐఎల్‌ ఆదాయంలో ఓటూసీ విభాగం రూ. 1.2 లక్షల కోట్లను సాధించింది. ఇది 58 శాతం వృద్ధికాగా.. నిర్వహణ లాభం 44 శాతం ఎగసి రూ. 12,720 కోట్లకు చేరింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌ ప్రభావం చూపింది. ఇక రిలయన్స్‌ రిటైల్‌ అమ్మకాలు 9 శాతంపైగా పుంజుకుని రూ. 39,926 కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 45 శాతం జంప్‌చేసి రూ. 2,913 కోట్లను తాకింది. మార్జిన్లు 1.8 శాతం మెరుగుపడి 7.3 శాతానికి చేరాయి. కొత్తగా 813 స్టోర్లను ప్రారంభించింది. దీంతో స్టోర్ల సంఖ్య 13,635కు చేరింది.

జియో జోరు..: టెలికం, డిజిటల్‌ సరీ్వసుల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ క్యూ2లో నికర లాభం 23.5% వృద్ధితో రూ. 3,728 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.138.4 నుంచి రూ. 143.6కు మెరుగుపడింది. స్థూల ఆదాయం 15% పెరిగి రూ.23,222 కోట్లకు చేరింది. ఇక చమురు, గ్యాస్‌ విభాగం ఆదాయం 363% పురోగమించి రూ. 1,644 కోట్లయ్యింది. నిర్వహణ లాభం రూ. 1071 కోట్లకు చేరింది. రోజుకి 18 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల ఉత్పత్తిని సాధించింది. కేజీ–డీ6 బ్లాకులో ఉత్పత్తి ప్రారంభంకావడం ఇందుకు సహకరించింది.

ఇతర హైలైట్స్‌
► సెప్టెంబర్‌కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 2,59,476 కోట్లుగా నమోదైంది. మరోపక్క రూ. 2,55,891 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా నిలుస్తోంది.  
► క్యూ2లో పెట్టుబడి వ్యయాలు రూ. 39,350 కోట్లుగా నమోదయ్యాయి.  
► జియో వినియోగదారులు 23.8 మిలియన్లమేర పెరిగి 429.5 మిలియన్లకు చేరారు.  
► దీపావళికల్లా జియోఫోన్‌ నెక్స్‌ట్‌ పేరుతో చౌక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు గూగుల్‌తో కలసి జియో పనిచేస్తోంది.   

సంతోషంగా ఉంది..
ఈ ఏడాది క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినందుకు సంతోషిస్తున్నాం. కంపెనీ బిజినెస్‌లకున్న సహజసిద్ధ పటిష్టతకు ఇది నిదర్శనం. అంతేకాదు.. దేశ, విదేశీ ఆర్దిక వ్యవస్థల వేగవంత రికవరీని ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయి. రిటైల్, ఓటూసీ, డిజిటల్‌ సరీ్వసుల విభాగాలలో నిలకడైన వృద్ధి కొనసాగింపును మెరుగైన నిర్వహణ, ఆర్దిక పనితీరు సూచిస్తున్నాయి. శుద్ధ ఇంధనంవైపు ప్రపంచ ప్రయాణంలో భారత్‌ ముందుండే బాటలో పర్యావరణ అనుకూల పెట్టుబడులను చేపడుతున్నాం. ఈ బాటలో ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీలతో చేతులు కలుపుతున్నాం. 2035కల్లా నికరంగా జీరో కార్బన్‌ లక్ష్యాన్ని చేరగలమన్న నమ్మకం మరింత   పెరిగింది.     
– ముకేశ్‌ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top