టెలికం దశ మోగుతోంది..

Rating Agency ICRA Says Telecom Sector Will Surge In Upcoming Years - Sakshi

టెలికం రంగ ఔట్‌లుక్‌ సుస్థిరం 

ప్రతికూల రేటింగ్‌ను సవరించిన ఇక్రా 

టారిఫ్‌ల పెంపు, ఉపశమన చర్యల ఎఫెక్ట్‌ 

2023 మార్చికల్లా రూ. 170కు ఏఆర్‌పీయూ 

వచ్చే ఏడాది ఆదాయాలు 18–20 శాతం అప్‌   

న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగ ఔట్‌లుక్‌ను తాజాగా రేటింగ్‌ దిగ్గజం ఇక్రా స్థిరత్వాని(స్టేబుల్‌)కి అప్‌గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన ప్రతికూల(నెగిటివ్‌) రేటింగ్‌ను సవరించింది. ఇందుకు టెలికం కంపెనీల టారిఫ్‌ల పెంపుతోపాటు.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఉపశమన చర్యలు(ప్యాకేజీలు) ప్రభావం చూపినట్లు ఇక్రా పేర్కొంది. వెరసి టెలికం పరిశ్రమ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అవకాశాలు లభించనున్నట్లు అభిప్రాయపడింది. అంతేకాకుండా 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌నకు అవసరమయ్యే పెట్టుబడులను సైతం సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. టెలికం వినియోగదారులు నిలకడగా 2జీ నుంచి 4జీకి మారుతుండటంతో టెలిఫోనీ సర్వీసుల వినియోగం పెరుగుతున్నట్లు ఇక్రా వివరించింది. ఫలితంగా టెలికం కంపెనీల సగటు వినియోగదారు ఆదాయం(ఏఆర్‌పీయూ) 2023 మార్చికల్లా రూ. 170కు చేరగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. దీంతో టెలికం రంగ ఔట్‌లుక్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వానికి అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఇక్రా వెల్లడించింది.  

కారణాలున్నాయ్‌..
దీర్ఘకాలంగా వేచిచూస్తున్న టారిఫ్‌ల పెంపును టెలికం కంపెనీలు ఇటీవల అమల్లోకి తీసుకువస్తుండటంతో 2023 మార్చికల్లా ఏఆర్‌పీయూ రూ. 170ను తాకవచ్చని ఇక్రా రేటింగ్స్‌ అభిప్రాయపడింది. దీనికితోడు ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలు ఈ రంగానికి దన్నుగా నిలవనున్నట్లు తెలియజేసింది. ఇటీవల టెలికం కంపెనీలు ప్రీపెయిడ్‌ టారిఫ్‌లను సుమారు 20 శాతం పెంచడంతో ఏఆర్‌పీయూలు మెరుగుపడనున్నట్లు ఇక్రా లిమిటెడ్‌ కార్పొరేట్‌ రేటింగ్స్‌ గ్రూప్‌ హెడ్, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సవ్యసాచి మజుందార్‌ వివరించారు. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)కల్లా టెలికం పరిశ్రమ ఆదాయం 18–20 శాతం పుంజుకోవచ్చని అంచనా వేశారు. ఈ బాటలో 2024 మార్చికల్లా ఆదాయాలు మరో 10–12 శాతం బలపడగలవని అభిప్రాయపడ్డారు. దీంతో 2023కల్లా నిర్వహణ లాభాలు 30 శాతం వృద్ధి చూపే వీలున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్యాకేజీల కారణంగా 2025కల్లా పరిశ్రమలో వార్షికంగా రూ. 40,000 కోట్లమేర క్యాష్‌ఫ్లోకు వీలున్నట్లు మదింపు చేశారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top