10 నిమిషాల్లో రూ. 230 కోట్లు మాయం..! బొక్కబోర్ల పడిన ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌..!

Rakesh Jhunjhunwala Lost 230 Crore In These Two Stocks In 10 Minutes - Sakshi

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు..! ఓడలు బండ్లు..బండ్లు ఓడలవ్వడానికి ఎంత సమయం పట్టకపోవచ్చు. స్టాక్‌ మార్కెట్లలో మరీను..! ఎప్పుడూ భారీ లాభాలను తెచ్చి పెట్టే కంపెనీల షేర్లు.. అప్పుడప్పుడు భారీ నష్టాలను కూడా తెచ్చి పెడతాయి. ఇలాంటి సంఘటనే ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు కూడా ఎదురైంది. 

అప్పుడు లాభాలు..ఇప్పుడు నష్టాలు..!
బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో టాటా కంపెనీ షేర్లు అత్యంత ముఖ్యమైనవి. ఒకానొక సమయంలో టాటా కంపెనీ షేర్లు బిగ్‌బుల్‌కు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. గత కొద్ది రోజల నుంచి దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.  బలహీనమైన గ్లోబల్ మార్కెట్ల సూచనలు, ఒమిక్రాన్‌ భయాలు, ఫెడ్‌ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఈ రోజు నిఫ్టీ 381 పాయింట్లు పతనమై 16,604 స్థాయిలను తాకగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1250 పాయింట్లు నష్టపోయి 55,761 స్థాయిలను తాకింది. స్టాక్‌ మార్కెట్స్‌ నష్టాల బ్లడ్‌ బాత్‌లో బిగ్ బుల్ రాకేష్ తడిసిపోయారు. సూచీలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే  ఏకంగా రెండు టాటా స్టాక్స్‌లో సుమారు రూ. 230 కోట్లను కోల్పోయాడు బిగ్‌బుల్‌. టైటాన్‌ కంపెనీ ద్వారా రూ. 170 కోట్లను, టాటా మోటార్స్‌తో రూ. 60 కోట్ల నష్టాలను రాకేష్‌ మూటకట్టుకున్నారు. 

టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం... ఈ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా , అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా భారీ  వాటాలను కలిగి ఉన్నారు.  టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,37,60,395 షేర్లను, రేఖా ఝున్‌ఝున్‌వాలా 95,40,575 షేర్లను కలిగి ఉన్నారు. అదేవిధంగా టాటా మోటార్స్ షేర్‌హోల్డింగ్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,67,50,000 షేర్లను కల్గి ఉన్నారు. 

భారీగా పతనమైన షేర్లు..!
ఈరోజు ఎన్‌ఎస్‌ఈలో టైటాన్ కంపెనీ ధర శుక్రవారంతో పోల్చితే రూ. 39.30 తగ్గి రూ. 2238. 15 కు తగ్గింది. అదేవిధంగా టాటా మోటార్స్ షేరు ధర శుక్రవారంతో పోల్చితే రూ. 15.90 తగ్గి రూ. 454.30 కు చేరింది. 

చదవండి: వేల కోట్ల పన్ను కడుతున్నాడు? ఈ కుబేరుడి దగ్గర ఉన్న సంపద ఎంత?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top