ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి

Public Sector Enterprises policy to be more ambitious - Sakshi

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్‌ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్‌) మార్కెట్‌ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్‌ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్‌ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్‌ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం.

‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్‌ బజాజ్‌ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్‌ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.  

ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం
త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్‌ బజాజ్‌.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top