ఆ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. వందల కోట్ల పెట్టుబడులు!

Premji Invest To Pick 10% Stake In Sagar Cements - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌.. హైదరాబాద్‌కు చెందిన సాగర్‌ సిమెంట్స్‌లో 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. డీల్‌ విలువ రూ.350 కోట్లు. ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన రూ.2 ముఖ విలువ కలిగిన 1.32 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.265 చొప్పున ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు  జారీ చేయాలన్న ప్రతిపాదనకు సాగర్‌ సిమెంట్స్‌ బోర్డ్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. 

డీల్‌ కారణంగా సాగర్‌ సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి వచ్చి చేరింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్‌ సిమెంట్స్‌ వెల్లడించింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సలహాల కోసం ఎదురుచూస్తున్నామని సాగర్‌ సిమెంట్స్‌ జేఎండీ ఎస్‌.శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

కంపెనీతో కలిసి వృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి, అత్యుత్తమ పాలన ప్రక్రియలతో దేశవ్యాప్త బ్రాండ్‌గా మారడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ పార్ట్‌నర్‌ రాజేశ్‌ రామయ్య చెప్పారు. సాగర్‌ సిమెంట్స్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులు.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top