ఆటబొమ్మలకు త్వరలో పీఎల్‌ఐ | PLI schemes for e-bikes components and footwear in advance stage | Sakshi
Sakshi News home page

ఆటబొమ్మలకు త్వరలో పీఎల్‌ఐ

Jun 15 2023 6:27 AM | Updated on Jun 15 2023 6:27 AM

PLI schemes for e-bikes components and footwear in advance stage - Sakshi

న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద తోలు, పాదరక్షలు, ఆటబొమ్మలు, నూతన తరం సైకిళ్ల విడిభాగాలకు ప్రోత్సాహకాల ప్రతిపాదన పురోగతి దశలో ఉందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. వివిధ శాఖలు తమ పరిధిలో పీఎల్‌ఐ కింద ఆశించిన మేర పురోగతి లేకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు, భారత్‌లో తయారీకి ఊతమిచ్చేందుకు పీఎల్‌ఐ కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ 2023 మార్చి నాటికి రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా, కేవలం రూ. 2,900 కోట్ల ప్రోత్సాహక నిధులనే కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో రాజేష్‌ కుమార్‌ స్పందించారు. ఐటీ రంగం మాదిరే కొన్ని సవరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇతర రంగాలకూ ఏర్పడొచ్చన్నారు.

ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులకు సంబంధించి గత నెలలో కేంద్ర సర్కారు పీఎల్‌ఐ 2.0ని ప్రకటించడం గమనార్హం. ‘‘పీఎల్‌ఐ కింద రూ.1.97 లక్షల కోట్లు వినియోగం అవుతాయనే నమ్మకం ఉంది. కాకపోతే విడిగా ఒక్కో పథకంలో అవసరమైతే దిద్దుబాటు, సవరణలు ఉంటాయి’’అని రాజేష్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. మొబైల్స్‌ తయారీలో కావాల్సిన విడిభాగాల తయారీ దేశీయంగా 20 శాతమే ఉండగా, దాన్ని 50 శాతానికి తీసుకెళతామని రాజేష్‌ కుమార్‌ తెలిపారు. చైనాలో ఇది 49 శాతం, వియత్నాంలో 18 శాతమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement