ఆ ఫోన్‌ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్‌

Phone Numbers Are Activated Again After Three Months - Sakshi

రద్దు చేసుకున్న, పనిచేయని మొబైల్‌ నంబర్లను కనీసం మూడు నెలల తర్వాతే  వేరేవారికి కేటాయిస్తామని భారత టెలికాం నియంత్రణ సంస్థ-ట్రాయ్‌ తెలిపింది. డియాక్టివేట్ లేదా డిస్‌కనెక్ట్ చేసిన మొబైల్ నంబర్లు వాడిన వారి సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు చెప్పింది. 

మొబైల్ నంబర్లు డిస్‌కనెక్ట్, డీయాక్టివేట్‌ చేసిన తర్వాత వాట్సాప్‌ వంటి మాధ్యమాల ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందని గతంలో సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. అందుకు ప్రతిగా ట్రాయ్‌ స్పందించింది. 

ఇదీ చదవండి: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు

ఈ రిట్‌పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ట్రాయ్‌ తన స్పందనను తెలియజేసింది. గతంలో ఫోన్‌ నంబరు వాడిన చందాదారుడి గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే 90 రోజుల వ్యవధి విధించినట్లు చెప్పింది. సబ్‌స్క్రైబర్లు సైతం తమ వంతుగా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించింది. వాట్సప్‌ సైతం తన స్పందనను కోర్టుకు తెలియజేసింది. ఒకవేళ 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు వాడకంలోలేని ఫోన్‌నంబర్లు ఆ తర్వాత కొత్త డివైజ్‌లో యాక్టివేట్‌ అయితే అందులోని డేటా మొత్తం తొలగిపోతుందని తెలిపింది. దాంతో గతంలో ఫోన్‌నంబర్‌తో వాట్సాప్‌ వాడిన వారి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top