India PC Market: పీసీ మార్కెట్‌ జోరు.. 37 లక్షల సేల్స్‌, తగ్గేదేలే!

Personal Computer Sales Increase Pushed To Nearly 4 Million In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో పర్సనల్‌ కంప్యూటర్స్‌ (పీసీ) విపణి జోరు మీద ఉంది. ఏప్రిల్‌–జూన్‌లో 37 లక్షల యూనిట్ల డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్‌ స్టేషన్స్‌ అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే ఇది 17.8 శాతం అధికం అని ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) వెల్లడించింది. ఐడీసీ ప్రకారం.. మొత్తం విక్రయాల్లో 26 లక్షల యూనిట్లతో నోట్‌బుక్స్‌ విభాగం తన హవాను కొనసాగిస్తోంది.

అయితే గడిచిన మూడు త్రైమాసికాల్లో నోట్‌బుక్స్‌ సగటున 30 శాతం వృద్ధి చెందితే 2022 ఏప్రిల్‌–జూన్‌లో ఇది 7.3 శాతానికే పరిమితం అయింది. 10 లక్షలకుపైగా డెస్క్‌టాప్స్‌ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఒక మిలియన్‌ యూనిట్లు దాటడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. ప్రభుత్వ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణం.  

ఆన్‌లైన్‌ బిగ్‌ సేల్ప్‌సై ఆశలు..
డెస్క్‌టాప్స్‌ విక్రయాల విషయంలో గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఎంటర్‌ప్రైస్‌ విభాగం తక్కువగా 14.9 శాతం వృద్ధి చెందింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల నుంచి ఆర్డర్లు రెండు త్రైమాసికాల కంటే తక్కువగా నమోదైంది. అధిక ద్రవ్యోల్బణం, మాంద్యం భయం, డాలర్‌ ధర హెచ్చుతగ్గులు ముఖ్యంగా స్టార్టప్‌లలో పీసీల సేకరణను నెమ్మదించాయి. పెద్ద సంస్థలు ఆలస్యంగా కొనుగోలు చేస్తున్నాయి. రాబోయే ఆన్‌లైన్‌ బిగ్‌ సేల్స్‌ వినియోగదారుల విభాగంలో ఆశాకిరణంగా ఉండవచ్చు. అయితే వాణిజ్య విభాగంలో ప్రభుత్వ సంస్థల నుంచి బలమైన ఊపు, ఎంటర్‌ప్రైసెస్‌ నుంచి ఇప్పటికే ఉన్న ఆర్డర్లు సానుకూల అంశం. 

స్టోర్లకు కస్టమర్ల రాక.. 
కొన్ని త్రైమాసికాలుగా ఆన్‌లైన్‌ సేల్స్‌ క్రమంగా తగ్గుతున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరుగుతోంది. పాఠశాలలు తెరవడం ప్రారంభించడంతో పీసీ మార్కెట్‌ వృద్ధి తగ్గింది. తద్వారా రిమోట్‌ లెర్నింగ్‌ డిమాండ్‌ తగ్గిందని ఐడీసీ ఇండియా పీసీ డివైసెస్‌ సీనియర్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ భరత్‌ షెనాయ్‌ తెలిపారు. ‘కళాశాలల ప్రారంభం ఆలస్యమైంది. కళాశాలల ప్రమోషన్లతో తిరిగి అమ్మకాలు ఊపందుకుంటాయని విక్రేతలు ఇప్పటికీ ఆశిస్తున్నారు. ఆన్‌లైన్‌ అమ్మకాలు కూడా 2022 మూడవ త్రైమాసికం చివరిలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అధిక నిల్వలు ఆందోళన కలిగించే విషయం. రాబోయే కొద్ది నెలల్లో సరుకు నిల్వల దిద్దుబాటు అనివార్యం’ అని వివరించారు.   

ముందంజలో హెచ్‌పీ
పీసీల అమ్మకాల్లో హెచ్‌పీ ముందంజలో ఉంది. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 30.8 శాతం మార్కెట్‌ వాటాతో 11.53 లక్షల యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది. రెండవ స్థానంలో ఉన్న డెల్‌ వాటా 21.6 శాతంగా ఉంది. ఈ కంపెనీ 8.07 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. లెనోవో 19.6 శాతం వాటాతో 7.34 లక్షల యూనిట్లను విక్రయించింది. ఏసర్‌ గ్రూప్‌ 8.9 శాతం వాటాతో 3.32 లక్షలు, ఆసస్‌ 6.1 శాతం వాటాతో 4.86 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించాయి. 

చదవండి: ద్రవ్యోల్బణం: అధికారులతో ఆర్బీఐ గవర్నర్‌ భేటీ.. కీలక అంశాలు ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top