లక్షల కోట్లలో.. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు

Ongc, Indian Oil, Power Grid Top Profit Making Psus In Fy22 - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూలు/పీఎస్‌ఈలు) నికర లాభం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 51 శాతం పెరిగి రూ.2.49 లక్షల కోట్లుగా ఉంది. ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ (ఐవోసీ), పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, సెయిల్‌ అత్యధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. 2020–21లో ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. 

ఇక నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థల నష్టం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.23వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లకు తగ్గింది. అంటే నష్టాన్ని 38 శాతం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. 

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఎయిర్‌ ఇండియా అస్సెట్‌ హోల్డింగ్స్, ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్, అలయన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ ఎక్కువ నష్టాలతో నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల స్థూల ఆదాయం 2021–22లో రూ.31.95 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.24.08 లక్షల కోట్లుగా ఉండడం గమనించాలి. అంటే ఏడాదిలో 33 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా పెట్రోలియం రిఫైనరీ మార్కెటింగ్, ట్రేడింగ్‌ అండ్‌ మార్కెటింగ్, పవర్‌ జనరేషన్‌ కంపెనీలే ఆదాయంలో 69 శాతం వాటా సమకూరుస్తున్నాయి.  

ప్రభుత్వానికి భారీ ఆదాయం.. 
2021–22 సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన డివిడెండ్‌ రూ.1.15 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ రూ.73వేల కోట్లుగానే ఉంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు ఎక్సైజ్‌ డ్యూటీ, కస్టమ్‌ డ్యూటీ, జీఎస్‌టీ, కార్పొరేట్‌ పన్ను, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు, డివిడెండ్, ఇతర సుంకాల రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 2021–22లో రూ.5.07 లక్షల కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4.97 లక్షల కోట్లుగా ఉంది.

ఇలా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన టాప్‌–5 కంపెనీల్లో ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ ఒమన్‌ రిఫైనరీస్, చెన్నై పెట్రోలియం ఉన్నాయి. ఇక కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద అర్హులైన కంపెనీలు చేసిన ఖర్చు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,600 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,483 కోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యక్రమాలకు చేయూతలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆయిల్, ఎన్‌ఎండీసీ, పవర్‌గ్రిడ్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top