ఆఫీస్‌ స్థలం లీజింగ్‌ పెరిగింది

Office Space Leasing Increases 29pc From July Sep - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ మధ్య ఎనమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 1.61 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి అని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. పరిమాణం పరంగా ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యధికమని వివరించింది. ‘లీజింగ్‌ లావాదేవీల పరిమాణం మహమ్మారికి ముందస్తు త్రైమాసిక సగటును 6 శాతం అధిగమించాయి.

మొత్తం లీజింగ్‌ పరిమాణంలో బెంగళూరు అత్యధికంగా 45 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ నగరంలో లీజింగ్‌ 71 శాతం దూసుకెళ్లి 73 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గత 18 నెలల్లో ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. కంపెనీలు కార్యాలయం నుంచి పని విధానాలను అమలు చేయడం వల్ల ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ పెరుగుతోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ తెలిపారు. ఈ ఏడాది వార్షిక లీజింగ్‌ పరిమాణం 2019 రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనాగా చెప్పారు.  

నగరాల వారీగా ఇలా.. 
ఆఫీస్‌ లీజింగ్‌ స్థలం ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 23 శాతం పెరిగి 24 లక్షల చదరపు అడుగులు, ముంబై 82 శాతం ఎగసి 21 లక్షల చదరపు అడుగులు, అహ్మదాబాద్‌ రెండింతలై 7 లక్షల చదరపు అడుగులు, కోల్‌కత రెండింతలకుపైగా దూసుకెళ్లి 3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఇక హైదరాబాద్‌ గతేడాదితో పోలిస్తే కార్యాలయ స్థలం లీజింగ్‌ 60 శాతం పడిపోయి 8 లక్షల చదరపు అడుగులు, పుణే 27 శాతం తగ్గి 7 లక్షల చదరపు అడుగులకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కార్యాలయ స్థలం నూతనంగా 1.3 కోట్ల చదరపు అడుగులు జతకూడింది. ఇందులో బెంగళూరు 49 లక్షలు, హైదరాబాద్‌ 33 లక్షల చదరపు అడుగులు సమకూర్చాయి. మొత్తం లావాదేవీల్లో కో–వర్కింగ్‌ రంగం వాటా 23 శాతానికి చేరింది.

చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top