Office Space Demand Dipped 6 PERCENT to 13. 9MN Sq Ft in Apr-June Quarter - Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ లీజింగ్‌లో స్తబ్ధత

Jul 21 2023 12:50 AM | Updated on Jul 21 2023 2:23 PM

Office space demand dipped 6percent to 13. 9mn sq ft in Apr-June quarter - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్‌ మార్కెట్‌ జూన్‌ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్‌ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి.

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంపై రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ ‘వెస్టియన్‌’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్‌సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్‌ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్‌ క్వార్టర్‌లో ఏడు పట్టణాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజు డిమాండ్‌ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్‌ త్రైమాసికంలో ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్‌ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్‌ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు.  

టెక్నాలజీ రంగం ముందు
ఆఫీస్‌ స్పేస్‌ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్‌ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్‌ ఉందని.. ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్‌ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్‌లో రియల్‌ ఎసేŠట్ట్‌ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది.

పట్టణాల వారీగా..
► విడిగా చూస్తే హైదరాబాద్‌ ఆఫీస్‌ లీజు మార్కెట్‌లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్‌ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.  
► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్‌ చదరపు అడుగులకు పెరిగింది.
► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది.
► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.
► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంది.  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్‌ చదరపు అడుగులకు ఆఫీస్‌ లీజు పరిమితమైంది.  
► కోల్‌కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.  
► జూన్‌ త్రైమాసికంలో ఆఫీస్‌ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వాటా 18%గా నమోదైంది.  
► ఈ ఏడాది జనవరి–జూన్‌ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 25.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement