
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్‌పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్‌పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.
ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్‌ఎస్‌ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి.
రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది..
దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి.
కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్‌లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు.