పెట్టుబడి సురక్షితంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, స్థిర రాబడి కూడా పొందవచ్చు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా.. నష్టం మాత్రం ఉండదు. అయితే మీకు వచ్చే రాబడి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథనంలో ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.
సాధారణంగా వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదు, కానీ 50 బేసిస్ పాయింట్ల చిన్న వ్యత్యాసం కూడా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. లాభం అనేది ముఖ్యంగా పెట్టుబడి పెట్టిన మొత్తం గణనీయంగా ఉన్నప్పుడు & కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
HDFC బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ అందిస్తుంది.
ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు.. సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9% వడ్డీని అందిస్తుంది. అయితే, 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగినప్పుడు.. బ్యాంక్ అత్యధికంగా 6.7%, 7.2% వడ్డీని అందిస్తుంది.
ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు తన మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.7% & సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితాలో ఇది ఒకరి కావడం గమనార్హం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.3% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీని అందిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు కొంత ఎక్కువ వడ్డీ (6.45% & 6.95%) అందిస్తుంది.
కెనరా బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25% & సీనియర్ సిటిజన్లకు 6.75 వడ్డీని ఇస్తుంది. అయితే, 444 రోజుల కాలపరిమితి ఉన్నప్పుడు అత్యధిక రేట్లు (6.5% & 7%) పొందవచ్చు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6% & సీనియర్ సిటిజన్లకు 7.1% వడ్డీని అందిస్తుంది.
ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!


