ఎన్‌ఎస్‌ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు | NSE Active Investors Drop to 3 Year Low as Global Geopolitical Tensions | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు

Apr 15 2026 1:37 PM | Updated on Apr 15 2026 1:51 PM

NSE Active Investors Drop to 3 Year Low as Global Geopolitical Tensions

స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో క్రియాశీల పెట్టుబడిదారుల (యాక్టివ్‌ ఇన్వెస్టర్లు) సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 35 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత ఇన్వెస్టర్ల బేస్‌లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం.

గణనీయంగా తగ్గిన క్లయింట్లు

ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో 4.92 కోట్లుగా ఉన్న క్రియాశీల ఇన్వెస్టర్ల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 7 శాతం క్షీణించి 4.58 కోట్లకు చేరుకుంది. ఈ పతనంలో దేశంలోని అగ్రశ్రేణి డిస్కౌంట్ బ్రోకర్లదే ప్రధాన వాటా కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం తగ్గుదలలో 70 శాతం వాటా కేవలం మూడు బ్రోకర్ల నుంచే ఉంది.

జెరోధా.. అత్యధికంగా 9.95 లక్షల మంది యాక్టివ్ క్లయింట్లను కోల్పోయింది (మొత్తం పతనంలో 29%).

ఏంజెల్ వన్.. 8.15 లక్షల మంది ఖాతాదారులు తగ్గారు (23%).

అప్ స్టాక్స్.. 7.6 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు స్వస్తి చెప్పారు (22%).

  • సాంప్రదాయ బ్రోకరేజీలైన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, షేర్‌ఖాన్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థలు కూడా లక్షకు పైగా క్లయింట్లను కోల్పోయాయి.

పెట్టుబడిదారుల నిరాశకు కారణాలు

  • యూఎస్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు, ప్రపంచ వాణిజ్య వివాదాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

  • ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడం ద్రవ్యోల్బణ భయాలను పెంచింది.

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐ) నిరంతరాయంగా నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది.

  • కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం, అధిక వాల్యుయేషన్లు ఇన్వెస్టర్లను భయపెట్టాయి.

  • ప్రాథమిక మార్కెట్‌లో (ఐపీఓ) వచ్చిన కంపెనీలు ఆశించిన స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.

  • గ్లోబల్ బ్రోకరేజీల ప్రతికూల రేటింగ్

  • భారత ఈక్విటీ మార్కెట్లపై నోమురా, గోల్డ్‌మన్ సాక్స్‌, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ రేటింగ్‌ను ‘తటస్థ’ (‍న్యూట్రల్‌) లేదా ‘అండర్ వెయిట్’కు తగ్గించాయి.

Advertisement
 
Advertisement
Advertisement