
‘మిషన్ డిజిటల్ శ్రమసేతు’ కార్యక్రమం కింద కృత్రిమ మేధ (ఏఐ) ప్రతీ కార్మికుడికి అందుబాటులో ఉండేలా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది. ‘సమ్మిళిత సామాజికాభివృద్ధికి ఏఐ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ, బ్లాక్‌చైన్, ఇమ్మర్సివ్ లెర్నింగ్(వీఆర్, ఏఆర్ సాధనాల సాయంతో), ఇతర టెక్నాలజీల ద్వారా.. ఆర్థిక అభద్రత, పరిమిత మార్కెట్ అవకాకాశాలు, నైపుణ్యాలలేమి వంటి వాటిని అధిగమించొచ్చని పేర్కొంది.
అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు, ప్లాట్‌ఫామ్‌ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు, అధిక ఉత్పాదకతకు మిషన్ డిజిటల్ శ్రమసేతు వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని వివరించింది. తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రస్తుత మాదిరే కొనసాగితే అసంఘటిత రంగంలో ప్రతీ కార్మికుడి వార్షిక ఆదాయం 2047 నాటికి 6,000 డాలర్లకు మించకపోవచ్చని, 14,500 డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది. కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. ‘దేశంలోని 49 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి’ అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణియన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..