బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.236, జైలులో దుర్భర జీవితం గడుపుతున్న నీరవ్‌ మోదీ

Nirav Modi Company Has Only Rs 236 In Bank Account - Sakshi

నీరవ్‌ మోదీ! ఒకప్పుడు ప్రముఖ బిలియనీర్. కానీ ఇప్పుడు చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తూ జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన కేసులో కోర్టుకు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పు కావాలని అర్రులు చాస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీరవ్‌కు చెందిన బ్యాంక్‌ అకౌంట్‌లో కేవలం రూ.236 ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  
   
2019లో నీరవ్‌ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి వేల కోట్ల ఎగనామం పెట్టి యూకేకి పారిపోయాడు. అక్కడ భారత్‌లో భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అ తర్వాత నీరవ్‌ పతనం ప్రారంభమైంది.

తాజా నివేదికల ప్రకారం.. నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌డిఐపిఎల్) వద్ద రూ. 236 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐకి రూ. 2.46 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. బ్యాంక్‌ అకౌంట్‌లో కేవలం రూ.236 ఉన్నట్లు తెలుస్తోంది. మరి బ్యాంక్‌లకు నీరవ్‌ చెల్లించాల్సిన మొత్తాన్ని దర్యాప్తు సంస్థలు ఏ విధంగా వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది.  

అప్పు కావాలి!
కాగా, గత వారం భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు నీరవ్‌ను ఆదేశించింది. కానీ నీరవ్‌ మోదీ తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు. దీంతో మరి విచారణ నిమిత్తం చెల్లించాల్సిన చట్టపరమైన ఖర్చుల్ని ఎలా చెల్లిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. అందుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్‌ తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున, తనకు తగిన వనరులు లేవని, కోర్టుకు చెల్లించే మొత్తాన్ని ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటానని, రుణ దాత కోసం అన్వేషిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top