హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్లు, హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌!

Newly Launched Homes Demand In Seven Cities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో కొత్త జోష్‌ మొదలైంది. కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లేదా ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపిన కొనుగోలుదారులు.. క్రమంగా కొత్త గృహాల వైపు మళ్లారు. లాంచింగ్‌ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా ట్రెండ్‌లో భాగ్యనగరంలోనే ఎక్కువగా ఉంది. దీంతో గతేడాది నగరంలో 25,410 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 55 శాతం ఇళ్లు కొత్తగా ప్రారంభమైనవే. తుది గృహ కొనుగోలుదారులతో పాటు పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడమే లాంచింగ్‌ ప్రాజెక్ట్స్‌లో విక్రయాల వృద్ధికి కారణమని అనరాక్‌ నివేదిక వెల్లడించింది. 

తాత్కాలికంగా విరామం వచ్చిన కొత్త గృహాలకు డిమాండ్‌ మళ్లీ పుంజుకుంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గతేడాది 2.37 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 34 శాతం కొత్తగా ప్రారంభమైన ఇళ్లే. 2020లో ఈ తరహా గణాంకాలు పరిశీలిస్తే.. 1.38 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 28 శాతంగా ఉంది. అలాగే 2019లో 2.61 లక్షల ఇళ్లు విక్రయం కాగా.. వీటి వాటా 26 శాతంగా ఉంది. ఈ తరహా విక్రయాలు అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. గతేడాది నగరంలో 25,410 యూనిట్లు సేల్‌ కాగా.. 55 శాతం కొత్త గృహాలే అమ్ముడుపోయాయి. అలాగే 2019లో 16,590 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 28 శాతంగా ఉంది. అత్యల్పంగా ముంబైలో 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది.  

ఈ ట్రెండ్‌ మంచిదేనా? 
గత 3–4 ఏళ్లలో నివాస సముదాయాలలో పెట్టుబడుల నుంచి నిష్క్రమించిన ఇన్వెస్టర్లు.. వాణిజ్యం, రిటైల్, గిడ్డంగుల వంటి ఇతర విభాగాలలో పెట్టుబడులపై దృష్టిసారించారు. వారంతా తిరిగి రెసిడెన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై ఫోకస్‌ పెట్టారు. ఇదే సమయంలో లిస్టెడ్, బ్రాండెడ్‌ డెవలపర్లు భారీ స్థాయిలో రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు. దీంతో గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2.37 లక్షల యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. గడువులోగా నిర్మాణం పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 2015లో 41:59గా ఉండే బ్రాండెడ్‌–నాన్‌ బ్రాండెడ్‌ డెవలపర్ల విక్రయాల నిష్పత్తి.. 2021 నాటికి 58:42కి పెరిగింది. గృహ విభాగంలోకి పెట్టుబడిదారులు చేరడం విక్రయాల పరంగా శుభపరిణామమే అయినా తుది కొనుగోలుదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు చేరిన చోట ధరలు వేగంగా పెరుగుతాయని చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.  

ఇతర నగరాల్లో.. 
గతేడాది ముంబైలో 76,400 గృహాలు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. అలాగే ఎన్‌సీఆర్‌లో 40,050 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 30 శాతం, చెన్నైలో 12,530 గృహాలు సేలవగా లాంచింగ్‌ యూనిట్ల వాటా 34 శాతం, కోల్‌కతాలో 13,080 ఇళ్లు అమ్ముడుపోగా.. వీటి వాటా 34 శాతం, బెంగళూరులో 33,080 యూనిట్లు విక్రయం కాగా.. కొత్త ఇళ్ల వాటా 35 శాతం, పుణేలో 35,980 ఇళ్లు అమ్ముడు పోగా.. లాంచింగ్‌ యూనిట్ల విక్రయాల వాటా 39 శాతంగా ఉంది.

చదవండి: మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాల‌ని అనుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top