బంగారం కొనుగోలులో కొత్త ట్రెండ్‌: నెల నెలా కొనేద్దాం! | new trends in gold purchasing | Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోలులో కొత్త ట్రెండ్‌: నెల నెలా కొనేద్దాం!

Oct 18 2023 7:38 AM | Updated on Oct 18 2023 7:42 AM

new trends in gold purchasing - Sakshi

ఒకేసారి  10 గ్రాముల ఆభరణం కొనుగోలు చేద్దామంటే.. ధరల తీవ్రత. దీనితో వినియోగదారులు నెలవారీ డిపాజిట్, కొనుగోళ్ల  పథకాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ధోరణి క్రమంగా పెరుగుతోందని బంగారం వర్తకులు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ‘నెలవారీ డిపాజిట్‌ పథకాల ద్వారా జరుగుతున్న విక్రయాల’ వాటా 50 శాతం దాటినట్లు కొందరు వర్తకులు వెల్లడించారు. దాదాపు ప్రతి గోల్డ్‌ రిటైల్‌ చైన్‌ డిపాజిట్‌ స్కీమ్‌లను కస్టమర్లకు అందిస్తున్నాయి. కొన్ని సంస్థల నుంచి అందిన వివరాలు..

తనిష్క్‌ రూ.3,890 కోట్ల సమీకరణ 
టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్‌ మార్చితో  ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) డిపాజిట్ల రూపంలో రూ.3,890 కోట్లు సమీకరించింది. అంతక్రితం  (2021–22) ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.2,701 కోట్లు. 

రిలయన్స్‌ రిటైల్‌లోనూ ఇదే ధోరణి.. 
2021–22తో పోల్చితే 2022–23లో ఈ పథకాల ద్వారా రిలయన్స్‌ రిటైల్‌ సమీకరణ మొత్తం రూ.184 కోట్ల నుంచి రూ.282 కోట్లకు ఎగసింది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ సంస్థ పలు పథకాలను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.  

పీఎన్‌జీ జ్యూవెలర్స్‌లో 27 శాతం అప్‌ 
పీఎన్‌జీ జ్యూవెలర్స్‌... డిపాజిట్‌ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు  2022–23లో రూ. 700 కోట్లు సమీకరంచింది. 2021–22తో పోల్చితే ఈ పరిమాణం 27 శాతం అధికం. మహారాష్ట్ర, గోవాల్లో ఈ సంస్థ 42 స్టోర్లను ఆపరేట్‌ చేస్తోంది.  

శాన్‌కో గోల్డ్‌  
పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లకు సంబంధించి కోల్‌కతాకు చెందిన  శాన్‌కో గోల్డ్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 192 కోట్లు సమీకరించింది. 2021–22తో పోల్చితే ఈ విలువ భారీగా 89 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

డిస్కౌంట్ల ఆకర్షణ 
డిపాజిట్‌ పథకాల ద్వారా పసిడి కొనుగోళ్లు పెరగడానికి రిటైలర్లు కూడా పలు ఆఫర్లు, ప్రోత్సాహకాలు అందజేస్తుండడం గమనార్హం. 10 నెలల స్కీమ్‌లో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్లో 75 శాతం వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తనిష్క్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌ వర్గాలు తెలిపాయి. ‘‘కోవిడ్‌ పసిడి ఆభరణాల కొనుగోళ్ల పథకాలపై ప్రభావం చూపాయి. అయితే మళ్లీ ఈ విభాగం ఇప్పుడు పురోగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే పసిడి పథకాల ద్వారా కొనుగోళ్ల విలువ 50 శాతం పెరిగింది’’ అని తనిష్క్‌ చైన్‌ నిర్వహించే టైటాన్‌ కంపెనీ జ్యూవెలరీ విభాగ సీఈఓ అజయ్‌ చావ్లా తెలిపారు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ మొత్తం తనిష్క్‌ అమ్మకాల్లో పసిడి పథకాల ద్వారా విక్రయాలు 19 శాతమని చావ్లా తెలిపారు. ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. పసిడి పథకాల్లో ఒక నిర్దిష్ట కాలానికి నెలవారీ డిపాజిట్ల ద్వారా చివరకు ఒక ఆభరణాన్ని పొందగలగడం ఒక అనుభూతిగా కస్టమర్లు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మన్ముందు సంవత్సరాల్లో నెలవారీ డిపాజిట్ల ద్వారా పసిడి కొనుగోళ్ల ధోరణి  మరింత పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఈ రంగంలోని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement