మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే తక్కువ ఫిర్యాదులు

Mutual Fund Industry Being Vilified Baselessly - Sakshi

దూషణలన్నీ నిరాధారం యాంఫి ప్రకటన

ముంబై: భారతీయ మ్యచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మొత్తం ఫైనాన్షియల్‌ మార్కెట్‌ వ్యవస్థలోనే అతి తక్కువ ఫిర్యాదులతో మెరుగైన స్థానంలో ఉందని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ప్రకటించింది. పరిశమ్రపై ఉన్నవి నిరాధార దూషణలే తప్పించి, వాస్తవాలు వేరని పేర్కొంది. భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఎంతో పారదర్శకతతో, సమగ్ర సమాచారాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఫండ్స్‌ పెట్టుబడుల సమాచారం వెల్లడించడం ఆధారంగా 26 దేశాల్లో భారత్‌కు మొదటిస్థానాన్ని మార్నింగ్‌స్టార్‌ ఇచ్చినట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ ప్రకటించారు.

యాంఫి ఇన్వెస్టర్ల నుంచి, పంపిణీదారుల నుంచి నేరుగా, సెబీ ద్వారానూ ఫిర్యాదులు అందుకుంటుందని వివరించారు. ఇలా వచ్చే ఫిర్యాదులను సాధారణమైన, తీవ్రమైన అని రెండు రకాలుగా వర్గీకరిస్తామని చెప్పారు. ‘‘డివిడెండ్‌ రాకపోవడం, అకౌంట్‌ స్టేట్‌మెంట్, కమీషన్‌ రాకపోవడం, రికార్డ్‌ అప్‌డేట్‌ చేయకపోవం సాధారణ ఫిర్యాదులు. దరఖాస్తు ఫారాల్లో అక్రమాలకు పాల్పడడం, మార్కెట్‌ యూనిట్లు, ఫండ్స్‌లో అవకతవకలకు పాల్పడడం, పంపిణీదారుల సేవల్లో లోపాలను తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’అని వివరించారు. 2017 ఏప్రిల్‌ నుంచి 2022 సెప్టెంబర్‌ మధ్య కేవలం 5,330 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డులు, బీమా, స్టాక్స్‌లో ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top