
అగ్రగామి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సీఎన్‌బీసీ తెలిపింది. ఇప్పటికే 2023 నుంచి కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు పేర్కొంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆవిష్కరణలపై సంస్థ గణనీయంగా పెట్టుబడులు పెంచుతోంది. ఈమేరకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించే విస్తృత వ్యూహంలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.
తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఇటీవల రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని గతంలో తెలిపింది.
ఇదీ చదవండి: వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీ
పీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు గతంలో తెలిపారు.