
భారత ఎయిర్ కండిషనర్(ఏసీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సంవత్సరానికి 1.4 కోట్ల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, ప్రజల డిస్పోజబుల్ ఆదాయాలు(ఖర్చులన్నీ పోను మిగులు ఆదాయాలు) అధికమవ్వడం ఏసీల కొనుగోళ్లకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు వీటిని లగ్జరీ వస్తువుగా కాకుండా, అవసరంగా భావిస్తున్నారని చెబుతున్నారు. ఏసీల కొనుగోళ్లలో పెరుగుదల కంపెనీలకు శుభపరిణామమే అయినా ఇతర అంశాలకు సంబంధించి తీవ్ర సవాళ్లను ఎత్తి చూపుతుంది.
పెరుగుతున్న డిమాండ్
దేశంలో ఎక్కువ మంది ప్రజలు నగరాలకు తరలివెళ్తున్నారు. వారి ఆదాయాలు మెరుగుపడటంతో ఏసీ కొనుగోళ్లకు మెగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఏసీలు కలిగి ఉన్నవారు కొత్త టెక్నాలజీ వర్షన్ మోడళ్లకు అప్‌డేట్ అవుతున్నారు. దాంతో వీటి డిమాండ్ పెరుగుతోంది. ఏసీని కొంత మంది మధ్య తరగతి ప్రజలు స్టేటస్ సింబల్‌గా కూడా చూస్తున్నారు. ఇటీవల వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రికార్టు స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. వీటి వల్ల ఏసీ లగ్జరీ నుంచి అవసరంగా మారుతోంది.
ఫైనాన్సింగ్ కంపెనీలు సైతం ఏసీ కొనుగోళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో సులువైన నెలవారీ వాయిదా పద్ధతులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇది కూడా ఏసీల అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతుంది. 2050 నాటికి రెసిడెన్షియల్ ఏసీల వినియోగం ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు అధికమవుతుందని, దీనివల్ల విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సవాళ్లు..
దేశంలో అధికశాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ తయారీ స్థానంలో పునరుత్పాదక ఇంధన తయారీని అభివృద్ధి చేస్తున్నా ఇంకా ఆమేరకు ప్రయత్నాలు కొంతమేరకే ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకైతే వేసవి కాలంలో ఎక్కువగా వాడే ఏసీలకు అవసరమయ్యే అధిక విద్యుత్‌ను బొగ్గు మండించడం ద్వారానే తయారు చేస్తున్నారు. ఇది భారత విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఏసీల్లో నుంచి వెలువడే గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది.
ఇదీ చదవండి: చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!
పరిష్కారాలు..
పునరుత్పాదక ఇంధన తయారీని పెంచాలి. సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. తక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యూపీ) రిఫ్రిజిరెంట్లతో కూడిన హై స్టార్ రేటెడ్ ఏసీలను వాడాలి. ఏసీల్లో ఇన్నోవేటింగ్ కూలింగ్ టెక్నాలజీస్‌ను ఉపయోగించాలి. ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచడానికి అర్బన్ ప్లానింగ్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి ఏసీపై ఆధారపడటాన్ని పరిమితం చేయాల్సి ఉంది.