
వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు) తయారీకి సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ)ను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుందని వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద మరిన్ని పెట్టుబడులకు పరిశ్రమ ఆసక్తి చూపిస్తుండడంతో తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది.
వైట్ గూడ్స్ పీఎల్‌ఐ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలకు అర్హులని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.10,406 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 83 దరఖాస్తులు వచి్చనట్టు తెలిపింది. ఈ పెట్టుబడులతో ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లకు సంబంధించి విడిభాగాలు దేశీయంగా తయారవుతాయని వెల్లడించింది. ఇందులో కొన్ని విడిభాగాలు దేశీయంగా తయారవుతున్నప్పటికీ తగినంత పరిమాణంలో లేనట్టు పేర్కొంది. మొదటిసారి వైట్ గూడ్స్ రంగానికి పీఎల్‌ఐ పథకాన్ని కేంద్రం 2021 ఏప్రిల్ 7న ప్రకటించడం గమనార్హం. 2021–22 నుంచి 2028–29 వరకు అమలు చేయాలని ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!