సాక్షి మనీ మంత్ర: ఎన్నికల నేపథ్యంలో ఈ మార్కెట్‌ స్ట్రాటజీతో లాభాలు! | Market Strategy In The Election Time For Gain Profits | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఎన్నికల నేపథ్యంలో ఈ మార్కెట్‌ స్ట్రాటజీతో లాభాలు!

Published Sat, Nov 11 2023 11:29 AM | Last Updated on Sat, Nov 11 2023 11:32 AM

Market Strategy In The Election Time For Gain Profits - Sakshi

దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా తీవ్ర ఒడుదుడుకుల్లో పయనిస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకవిలువ పడిపోతుంది. యూఎస్‌లో ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందనే భయాలు ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న పండగ నేపథ్యంలో మార్కెట్లు ఎలా కదలాడుతాయో  ఫండమెంటల్‌ బిజినెస్‌ అనలిస్ట్‌ కౌశిక్‌మోహన్‌తో ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్‌ కరుణ్యరావు మాట్లాడారు.

కారుణ్యరావు: దేశీయ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొన్నిరోజుల నుంచి వారి నగదును ఉపసహరించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికవరకు కొనసాగే అవకాశం ఉంది?

కౌశిక్‌మోహన్‌: ఈక్విటీ మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. అమెరికాలోని ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను పెంచుతుంది. దాంతో ఎఫ్‌ఐఐలు అప్రమత్తం అవుతున్నారు. ఒడుదొడుకులులేని అక్కడి డెట్‌ మార్కెట్‌లో మదుపుచేసేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో భారత్‌ మార్కెట్‌లో వారి నగదును ఉపసహరించుకుని అమెరికా వంటి వడ్డీ అధికంగా ఉంటే మార్కెట్లో మదుపు చేస్తున్నారు. వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేంత వరకు ఈపరిస్థితి కొనసాగనుంది. 

కారుణ్యరావు: మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు మాత్రం అంతగా స్పందించడం లేదు. పైగా అవి కొంతమేర పెరుగుతున్నాయి. అందుకుగల కారణం ఏమిటి?

కౌశిక్‌మోహన్‌: మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలకంటే లార్జ్‌క్యాప్‌ సూచీల్లో మదుపుచేసేందుకు మంచి అవకాశంగా కనిపిస్తుంది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు వాటి త్రైమాసిక ఫలితాలను మెరుగుపరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో రిటైలర్లు ఎక్కువగా వస్తుఆధారిత సేవలపై ఖర్చు చేస్తారు. దాంతో ఆ సూచీలు మరింత పెరిగే అవకాశం ఉంది.

కారుణ్యరావు: ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సెక్టార్‌లో మదుపుచేయాలి?

కౌశిక్‌మోహన్‌: అభివృద్ధి చెందుతున్న ఇండియాలో రానున్న రోజుల్లో అన్ని రంగాలు పుంజుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కెమికల్‌ సెక్టార్‌ మరింత మెరుగుపడే పరిస్థితులు ఉన్నాయి. చాలా కెమికల్‌ కంపెనీలు వాటి వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పారాసిటమోల్‌లో పారాఅమినోఫినాల్‌ను విరివిగా వాడుతారు. పారాసిటమోల్‌ను మనదేశంలోనే అధికంగా తయారుచేస్తారు. కానీ పారాఅమినోఫినాల్‌ను మాత్రం ఏటా 80వేల మెట్రిక్‌ టన్నుల మేర చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. ప్రస్తుతం చైనాలోని అనిశ్చితుల కారణంగా ప్రపంచం చూపు భారత్‌పై పడింది. దేశీయంగా ఉన్న కొన్ని కంపెనీలు నైట్రో బెంజీన్‌ నుంచి పారాఅమినోఫినాల్‌ను తయారుచేస్తున్నారు. దాంతో మరింత అవకాశాలు ఉండే వీలుంది. కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా మరింత లబ్ధిచేకూరే అవకాశం ఉంది.

కారుణ్యరావు: ప్రస్తుతం ఫార్మాసెక్టార్‌లోని స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్‌ ధరలనుంచి ఈ సెక్టార్‌ మరింత పుంజుకునే అవకాశం ఉందా?

కౌశిక్‌మోహన్‌: దేశీయ మార్కెట్‌లో ఫార్మాసెక్టార్‌ మరింత లాభాల్లోకి వెళుతుంది. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా రానున్న రోజుల్లో మాత్రలు, ఇంజెక్షన్‌లు, వైద్య పరికరాలకు మరింత ఖర్చుచేస్తారు. శరీరంలోని కొవ్వు కరిగించే మందులు తయారుచేసే కంపెనీలు వాటి పెట్టుబడులను విస్తరిస్తున్నాయి. దాంతోపాటు ఆయా కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. సంస్థల భవిష్యత్తు కార్యాచరణను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మెరుగైన లాభాలు పొందే వీలుంది.

కారుణ్యరావు: దీపావళి పండగ నేపథ్యంలో జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో భాగంగా ఏ స్టాక్‌ల ద్వారా లాభాలు సంపాదించవచ్చు?

కౌశిక్‌మోహన్‌: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రధానంగా కన్జూమర్‌ డ్యురబుల్‌ కంపెనీల్లో మంచి ర్యాలీ కనిపించనుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్‌ లిమిటెడ్‌, సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతాయని నమ్ముతున్నాను.

కారుణ్యరావు: ఆటోమొబైల్‌ రంగంలోని సూచీలు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అందుకు కారణాలు?

కౌశిక్‌మోహన్‌: అక్టోబరు నెలలో ఆఫర్ల నేపథ్యంలో చాలా మంది కొత్త వాహనాలు తీసుకుంటారు. దాంతో ఆ నెలలో ర్యాలీ కనిపిస్తుంది. వచ్చే డిసెంబరులో అంతగా ర్యాలీ ఉండకపోవచ్చు. చివరి నెలలో వాహనాలు తీసుకుంటే ఆ ఏడాది రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక నెల తర్వాత అదే జనవరిలో వాహనాలు కొనుగోలు చేస్తే వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్‌ అవుతుంది. దాంతో సాధారణంగా ఒడుదొడుకులు ఉంటాయి. 

కారుణ్యరావు: దేశంలోని ఫైనాన్స్‌ మార్కెట్‌ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది?

కౌశిక్‌మోహన్‌: ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రివర్స్‌ మెర్జర్‌ అవుతున్నాయి. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న సంస్థలను ఎంచుకుని ముదుపు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. 

కారుణ్యరావు: ఎన్నికల నేపథ్యంలో రానున్న మూడు నెలలకుగాను మార్కెట్‌లో లాభాలు పొందాలంటే ఎలాంటి స్ట్రాటజీ పాటించాలి?

కౌశిక్‌మోహన్‌: గరిష్ఠంగా మరో ఆరునెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. త్వరగా స్పందించి ఇప్పుడే మదుపుచేస్తే ఎన్నికల సమయం వరకు వచ్చే ర్యాలీలో లాభాలు పొందొచ్చు. మదుపు చేసే ముందు కంపెనీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉందో తెలుసుకోవాలి. త్రైమాసిక ఫలితాలు, బోర్డు సమావేశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

(Disclaimer:సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement