రూ. 2 కోట్ల గృహ రుణానికీ 6.66% వడ్డీ

LIC To Offer Home Loans Upto Rs 2 Crore At 6. 66 percent - Sakshi

ఆఫర్‌ను రూ.50 లక్షల నుంచి పెంచిన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌

ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇకపై రూ.2 కోట్ల వరకూ గృహ రుణంపై కూడా అతి తక్కువ వడ్డీరేటు 6.66 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. ఇప్పటి వరకూ  రూ.50 లక్షల రుణం వరకూ ఉన్న ఈ అతితక్కువ వడ్డీరేటు ఆఫర్‌ను రూ.2 కోట్ల వరకూ రుణానికి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కొత్త రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకూ 6.66 శాతం వద్ద అతితక్కువ రుణ రేటు నిర్ణయాన్ని ఈ యేడాది జూలైలో సంస్థ ప్రకటించింది. అయితే 6.66 శాతం వడ్డీరేటు కోరుకునే వారికి సిబిల్‌ స్కోర్‌ 700, ఆపైన ఉండాలి.

2021 సెపె్టంబర్‌ 22 నుంచి నవంబర్‌ 30 మధ్య రుణ మంజూరు జరిగి, మొదటి దఫా రుణ పంపిణీ 2021 డిసెంబర్‌లోపు జరిగి ఉండాలి. వేతనం పొందుతున్న వారితోపాటు స్వయం సంపాదనా పరులకూ తాజా నిర్ణయం వర్తిస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్‌ గౌడ్‌ తెలిపారు. రూ.2 కోట్ల వరకూ రుణం తీసుకున్న సందర్భంలో రుణ మొత్తంపై 0.25%  లేదా గరిష్టంగా రూ.10,000కానీ ఏది తక్కువైతే అంతమొత్తం ప్రాసెసింగ్‌ ఫీజు రాయితీ లభిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గృహ రుణానికి ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆమోదానికి ఉద్దేశించి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇటీవలే ‘హోమై యాప్‌’ను ఆవిష్కరించింది.
 

ఇప్పటికే పలు బ్యాంకులు ఇలా...
పండుగ సీజన్‌ డిమాండ్‌లో భారీ వాటా లక్ష్యంగా ఇప్పటికే ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) , పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ రేట్లను ఇటీవలే భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top