ఎల్‌ఐసీ ఐపీవో సక్సెస్‌

LIC IPO reflects the strength of Aatmanirbhar Bharat - Sakshi

3 రెట్లు అధికంగా బిడ్స్‌

3.5 శాతం వాటా విక్రయం

రూ. 20,600 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ సక్సెస్‌ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్‌ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్‌ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి.

ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్‌ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్‌ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్‌ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది.  

ఇతర హైలైట్స్‌
► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్‌ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది.
► బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో ఎల్‌ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్‌కానుంది.
► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్‌ఐసీ అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్‌(2021), రూ. 15,500 కోట్లతో కోల్‌ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్‌ పవర్‌(2008) నిలిచాయి.

ఆత్మనిర్భర్‌ భారత్‌
బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ ఆఫర్‌ను సక్సెస్‌ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top