ట్రెండ్‌ మారింది.. ఆ సెగ్మెంట్‌ టీవీల సేల్స్‌ మూడింతలు!

Large Panel Tv Market Triples In 5 Years To Over 40pc - Sakshi

లార్జ్‌ స్క్రీన్స్‌ టీవీల వాటా 40 శాతానికి

అయిదేళ్లలో మూడు రెట్లకు చేరిక

2027 నాటికి సగ భాగం వీటిదే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వేగవంతమైన ఇంటర్నెట్, వినోదానికి కావాల్సినంత కంటెంట్, భారీగా తగ్గిన ధరలు, వీక్షణం విషయంలో మారుతున్న ధోరణులు, పైగా కస్టమర్ల ఆదాయాల్లో వృద్ధి.. ఇంకేముంది పెద్ద సైజు టీవీల వైపు మార్కెట్‌ క్రమంగా మళ్లుతోంది. 40, ఆపైన అంగుళాల సైజున్న టీవీల విపణి అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం వీటి వాటా 40 శాతం ఉంది. 2027 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని రేటింగ్స్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రిసర్చ్‌ వెల్లడించింది. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల సంఖ్య అధికం అవడం కూడా పరిశ్రమకు కలిసి వచ్చే అంశం. గతంలో కొన్ని కంపెనీలు మాత్రమే ఈ విభాగంలో మోడళ్లను విక్రయించాయి. కొన్ని సంస్థలు భారత్‌లో రీ–ఎంట్రీ ఇచ్చాయి.

భారీగా తగ్గిన ధరలు..
పెద్ద సైజు టీవీల ధరలు ఎవరూ ఊహించనంతగా గడిచిన అయిదేళ్లలో భారీగా తగ్గాయి. 2017లో 55 అంగుళాల టీవీ ధర సుమారు రూ.1,00,000 ఉండేది. ఇప్పుడు రూ.30 వేల లోపు నుంచే లభిస్తున్నాయి. పాత బ్రాండ్లకుతోడు కొత్త బ్రాండ్ల రాకతో పోటీ తీవ్రమైంది. ధర, ఫీచర్లతో ఇవి తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి. శామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ, ప్యానాసోనిక్‌తోపాటు షావొమీ, వ్యూ టెక్నాలజీస్, క్రోమా, వన్‌ ప్లస్, థామ్సన్, తోషిబా, కొడాక్, థామ్సన్, ఏసర్, టీసీఎల్, లాయిడ్, సాన్‌సూయి, అమెజాన్‌ బేసిక్స్, హ్యుండై, హైసెన్స్, కాంప్యాక్, అకాయ్, ఒనిడా వంటి బ్రాండ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

రెండింతలైన బ్రాండ్స్‌.. 
గత 5–7 ఏళ్లలో 40, ఆపైన అంగుళాల టీవీల విభాగంలో బ్రాండ్ల సంఖ్య రెండింతలైంది. ప్రస్తుతం 70 దాకా బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయని క్రిసిల్‌ రిసర్చ్‌ డైరెక్టర్‌ పూషన్‌ శర్మ తెలిపారు. ‘43 అంగుళాల సైజులో అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పశ్చిమ దేశాలు 2018 సంవత్సరానికి ముందే పెద్ద సైజుకు మళ్లాయి. తలసరి ఆదాయం 2018లో 10.9 శాతం, 2019లో 9.3 శాతం అధికం అయింది. తలసరి ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక స్థోమత కూడా మెరుగుపడింది. మరోవైపు టీవీల ధరలు తగ్గాయి. ఈ ట్రెండ్‌ దీర్ఘకాలికంగా కొనసాగుతుందని అంచనా. ఇంటర్నెట్‌ వ్యాప్తి జోరు మీద ఉంది. ఇది ఓటీటీ వినోద వినియోగం పెరుగుదలకు దారి తీస్తోంది. వీక్షకులు పెద్ద టీవీ స్క్రీన్లలో ఓటీటీని ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు’ అని వివరించారు.

చదవండి: భారత్‌ ఆ ట్రెండ్‌ని మార్చింది.. ఆగస్ట్‌లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top