రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్‌కు వాటా | KKR to buy stake in Reliance retail | Sakshi
Sakshi News home page

రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్‌కు వాటా

Sep 23 2020 8:38 AM | Updated on Sep 23 2020 11:11 AM

KKR to buy stake in Reliance retail - Sakshi

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌లో తాజాగా పీఈ దిగ్గజం కేకేఆర్‌ అండ్‌ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ అంశాన్ని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్‌ రిటైల్‌లో 1.28 శాతం వాటాను  కేకేఆర్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువను రూ. 5,550 కోట్లుగా వెల్లడించింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌ ప్రీమనీ ఈక్విటీ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేసింది. 

వినియోగదారులకు లబ్ది
రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడిదారుగా కేకేఆర్‌కు ఆహ్వానం పలుకుతున్నట్లు డీల్‌ సందర్భంగా ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. రిటైల్‌ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీ వినియోగదారులకు లబ్ది చేకూర్చనున్నట్లు తెలియజేశారు. కాగా.. రిలయన్స్‌ రిటైల్‌ వాణిజ్యం ద్వారా అటు వినియోగదారులకూ, ఇటు చిన్నతరహా బిజినెస్‌లకూ ప్రయోజనం కలగనున్నట్లు కేకేఆర్‌ సహవ్యవస్థాపకులు హెన్రీ క్రావిస్‌ డీల్‌ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రిలయన్స్‌ రిటైల్‌లో పీఈ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ పార్టనర్స్‌ 1.75 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్‌ రిటైల్‌లో 10 శాతం వాటాను విక్రయించే యోచనలో ముకేశ్‌ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే డిజిటల్‌ విభాగం రిలయన్స్‌ జియోలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలియజేశాయి. కాగా.. 3.38 బిలియన్‌ డాలర్లను వెచ్చించడం ద్వారా కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌ విభాగాలను ఇటీవల రిలయన్స్ రిటైల్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.  

కేకేఆర్‌ వివరాలు
1976లో ఏర్పాటైన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్‌.. పలు కంపెనీలలో వాటాలను కొనుగోలు చేస్తూ వస్తోంది. బీఎంసీ సాప్ట్‌వేర్‌, టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌, గోజెక్‌ తదితరాలలో ప్రయివేట్‌ ఈక్విటీ, టెక్నాలజీ గ్రోత్‌ ఫండ్స్‌ ద్వారా ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసింది. కంపెనీ ఆవిర్భవించాక ఇంతవరకూ 20 టెక్నాలజీ కంపెనీలలో ఎంటర్‌ప్రైజ్‌ విలువ ప్రకారం 30 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. వీటిలో మీడియా, టెలికం కంపెనీలు సైతం ఉన్నాయి. ఈ బాటలో 2006 నుంచీ దేశీ కంపెనీలలోనూ పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇటీవల కేకేఆర్‌ రూ. 11,367 కోట్లు వెచ్చించడం ద్వారా రిలయన్స్‌ జియోలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement