ITC Employees Salaries: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220

ITC employees with over Rs one crore salary go up to 220 - Sakshi

2021–22లో 44 శాతం పెరుగుదల

ఎండీ వేతనం 5 శాతం పెంపు

న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్‌ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్‌ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీ సుమంత్‌ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్‌ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు.

2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్‌ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది.

ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ విభాగం స్పీడ్‌
గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్‌
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ఎఫ్‌ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్‌ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది.

గత కొన్నేళ్లుగా ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్‌ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్‌మేట్, శావ్‌లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది.  

ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top