ఐటీ రికార్డ్‌‌- మళ్లీ 46,000కు సెన్సెక్స్‌

IT index hit new high- Sensex zooms to 46000 points mark - Sakshi

453 పాయింట్ల హైజంప్‌‌‌‌‌- 46,007కు సెన్సెక్స్‌

ఇంట్రాడేలో 1,000 పాయింట్ల మధ్య ఊగిసలాట

138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద ముగిసిన నిఫ్టీ

ఫార్మా, మెటల్‌, ఆటో, బ్యాంకింగ్‌, రియల్టీ ప్లస్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం అప్‌

ముంబై, సాక్షి: దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బంతిలా పైకెగశాయి. వెరసి సెన్సెక్స్‌ మళ్లీ 46,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. చివర్లో ఊపందుకున్న కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 453 పాయింట్లు జంప్‌చేసి 46,007 వద్ద ముగిసింది. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 13,466 వద్ద నిలిచింది. రూపు మార్చుకుని యూరోపియన్‌ దేశాలలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా సోమవారం సెన్సెక్స్‌ 1400 పాయింట్లకుపైగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నేటి ట్రేడింగ్‌లోనూ తొలి రెండు సెషన్లలో మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. సెన్సెక్స్‌ 46,080- 45,112 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 13,492-13,193 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు)

అన్ని రంగాలూ 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఐటీ 3.4 శాతం ఎగసింది. 23,681 వద్ద ఐటీ ఇండెక్స్‌ సరికొత్త గరిష్టానికి చేరింది. ఈ బాటలో ఫార్మా, మెటల్‌, ఆటో, బ్యాంకింగ్ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, గెయిల్‌,విప్రో, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, నెస్లే, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, దివీస్‌, ఐషర్, ఏషియన్‌ పెయింట్స్‌ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్, ఇండస్‌ఇండ్‌, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో 1-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!)

కోఫోర్జ్‌ జోరు
డెరివేటి స్టాక్స్‌లో కోఫోర్జ్‌, మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌, ఐజీఎల్‌, బంధన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సన్‌ టీవీ, ఇండిగో, వేదాంతా, టాటా పవర్‌, సెయిల్‌, క్యాడిలా, టాటా కెమ్‌ 7.5-3.4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పీవీఆర్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పీఎన్‌బీ, భారత్‌ ఫోర్జ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, ఎస్కార్ట్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, అపోలో టైర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 6-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,568 లాభపడగా.. 1,352 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల వెనకడుగు
నగదు విభాగంలో ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్నవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం దాదాపు రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 486 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,721 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,425 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top