మార్చిలో ఎంఎఫ్‌లు డీలా | Sakshi
Sakshi News home page

మార్చిలో ఎంఎఫ్‌లు డీలా

Published Mon, Apr 15 2024 6:26 AM

Investments in equity mutual funds have languished in March - Sakshi

16 శాతం తగ్గిన పెట్టుబడులు

న్యూఢిల్లీ: గత నెల(మార్చి) ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు నీరసించాయి. జనవరితో పోలిస్తే 16 శాతం క్షీణించి రూ. 22,633 కోట్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ ఆధారిత పథకాలకు ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్ల పెట్టుబడులు లభించాయి. అయితే వరుసగా 37వ నెలలోనూ ఈక్విటీ ఎంఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించినట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ) మార్చి గణాంకాలు పేర్కొన్నాయి.

వీటి ప్రకారం థిమాటిక్‌ ఫండ్స్, కొత్త ఫండ్‌ ఆఫరింగ్స్‌(ఎన్‌ఎఫ్‌వోలు) ఇందుకు సహకరించాయి. ప్రధానంగా సిప్‌ నెలవారీ పెట్టుబడులు మార్చిలో రూ. 19,270 కోట్లకు చేరడం మద్దతిచి్చంది. ఫిబ్రవరిలో ఇవి రూ. 19,187 కోట్లుగా నమోదయ్యాయి. మార్చిలో హైబ్రిడ్‌ ఫండ్స్‌ రూ. 5,584 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇక మార్చితో ముగిసిన గతేడాది(2023–24) అంతక్రితం ఏడాదితో పోలిస్తే సిప్‌ పెట్టుబడులు 28 శాతం వృద్ధితో రూ. 2 లక్షల కోట్లను తాకాయి.

రుణ పథకాల నుంచి అత్యధికంగా రూ. 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి. మార్చిలో మొత్తం ఫండ్స్‌ పరిశ్రమ నుంచి రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఇందుకు ముందస్తు పన్ను చెల్లింపులు, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ అధిక విలువలకు చేరడం కారణమయ్యాయి. ఇక ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల విలువ(ఏయూఎం) ఫిబ్రవరిలో నమోదైన రూ. 54.54 లక్షల కోట్ల నుంచి మార్చికల్లా రూ. 53.4 లక్షల కోట్లకు వెనకడుగు వేసింది.

Advertisement
 
Advertisement