సబ్‌మెరిన్ కేబుల్స్‌కు కొత్త విధానం అవసరం | Building resilient subsea cables requires mix of redundant routes | Sakshi
Sakshi News home page

సబ్‌మెరిన్ కేబుల్స్‌కు కొత్త విధానం అవసరం

Jan 15 2026 3:47 PM | Updated on Jan 15 2026 3:51 PM

Building resilient subsea cables requires mix of redundant routes

ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్‌మెరిన్ కేబుల్ నెట్‌వర్క్‌ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్‌కు చేరుకుంది. అయితే, ఈ నెట్‌వర్క్‌లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.

భారత డిజిటల్ మౌలిక వసతులు

భారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్‌మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్‌ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్‌గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్‌వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్‌వర్క్‌లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.

ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?

ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్‌ను ల్యాండ్ చేసుకోవచ్చు.

సింగపూర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్?

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్‌ఎస్‌లతో సింగపూర్ తిరుగులేని హబ్‌గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్‌ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.

రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్‌సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement