బీమా రంగంలో అపార అవకాశాలు

Insurance sector has huge opportunities - Sakshi

పరిశ్రమ వర్గాల అంచనాలు

న్యూఢిల్లీ: బీమా రంగం వృద్ధికి బలమైన అవకాశాలు ఉన్నాయని.. విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు ఇక ముందూ కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిక పెట్టుబడుల అవసరం ఉన్న ఈ రంగంలో దీర్ఘకాల లక్ష్యాలతో.. ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీలతో ప్రవేశించే కొత్త కంపెనీలకూ చోటు ఉంటుందని పేర్కొంటున్నాయి. ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విలీనం చేసుకోవడానికి ఇటీవలే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతి మంజూరు చేయడం, అంతకుముందు పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ అంచనా వేస్తున్నాయి.

ఈ విధమైన లావాదేవీలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిష్కరించే విషయంలో సాయానికి బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సైతం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఈ కమిటీతో విలువ మదింపుపై అధికారులకు శిక్షణ ఇప్పించనుంది. బలమైన అండర్‌ రైటింగ్‌ విధానాలు, బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య విధానాలు కలిగిన సంస్థలు దీర్ఘకాలంలో బలంగా ఎదుగుతాయని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ డిప్యూటీ ఎండీ ఆనంద్‌ పెజావర్‌ తెలిపారు. భారత్‌లో బీమా రంగం విస్తరణకు అపార అవకాశాలున్నందున, ఎన్ని సంస్థలు అయినా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వరుస విలీనాలు..   
ప్రస్తుతం 24 జీవిత బీమా కంపెనీలు, 31 సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో వ్యవసాయ, ఆరోగ్య బీమా సంస్థలు కూడా కలిసే ఉన్నాయి. గతేడాది భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ వచ్చి ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో విలీనం కావడం గమనార్హం. అంతకుముందు 2020లో అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో విలీనం చేసుకుంది. 2016లో ఎల్‌అండ్‌టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సొంతం చేసుకుంది. ‘‘విస్తరణకు భారీ అవకాశాలున్నందున, జీవిత బీమా, జనరల్‌ బీమాలో టాప్‌–10 కంపెనీలు 90 శాతం లాభాల వాటాను కలిగి ఉంటాయి’’అని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిస్ట్‌ అవినాష్‌ సింగ్‌ తెలిపారు.  

విస్తరణ మార్గాలు..  
ఈ రంగంలో పనిచేసే కంపెనీలకు అదనపు నిధుల అవసరం ఉంటుందని, ఎప్పటికప్పుడు అవి నిధులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top