ఇన్ఫోసిస్‌కి షోకాజ్‌ నోటీస్‌, జరిమానా.. కారణం ఇదే

Infosys Branch In Hyderabad Fined For Collecting Parking Fees From Employees - Sakshi

దేశంలోనే రెండో అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్లో మార్పు తెచ్చేందుకు చేసిన చిన్న ప్రయత్నం బెడిసికొట్టింది. చివరకు కోర్టు నుంచి షోకాజ్‌ నోటీస్‌ అందుకోవడంతో పాటు మున్సిపాలిటీకి  జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహరం అంతా హైదరాబాద్‌ పరిధిలోనే జరిగింది. 

పోచారంలో 
ఐటీ హబ్‌గా విరాజిల్లుతున్న ఇన్ఫోసిస్‌ కంపెనీకి హైదరాబాద్‌లో అనేక క్యాంపస్‌లు ఉన్నాయి. అందులో వేల మంది ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. అయితే ఇటీవల పోచారం క్యాంపస్‌కి సంబంధించి అక్కడి నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది.

ఇలా చేయోచ్చా ?
పోచారంలోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో ఉద్యోగుల నుంచి పార్కింగ్‌ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. స్కూటర్‌కి రూ. 250, బైక్‌కి రూ. 300 కారుకి అయితే రూ.500ల వంతున పార్కింగ్‌ ఫీజుని నిర్ణయించారు. ఉద్యోగుల నుంచే సంస్థ పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ విజయ్‌ గోపాల్‌ అనే సామాజిక కార్యకర్త తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసమే
ఆఫీసుకు వచ్చే ఉద్యోగులకు ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారంటూ కోర్టు ఇన్ఫోసిస్‌ని ప్రశ్నించింది. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు కాకుండా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించేలా ప్రోత్సహించేందుకే పార్కింగ్‌ ఫీజును ప్రవేశపెట్టినట్టు ఇన్ఫోసిస్‌ వివరించింది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వినియోగించడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తీరుతాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

రూ. 50,000 ఫైన్‌
మరోవైపు ఉద్యోగుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని తప్పు పడుతూ పోచారం మున్సిపాలిటీ అధికారులు ఇన్ఫోసిస్‌కి రూ. 50,000 జరిమానా విధించారు. తెలంగాణ స్టేట్‌ అపార్ట్‌మెంట్‌ యాక్ట్‌ 1987, తెలంగాణ స్టేట్‌ మున్సిపాలిటీ యాక్ట్‌ 2019ల ప్రకారం అపార్ట్‌మెంట్లు, ఆఫీసుల్లో కామన్‌ ఏరియా, పార్కింగ్‌ల కోసం కేటాయించిన స్థలాన్ని కమర్షియల్‌ వ్యవహరాలకు ఉపయోగించరాదు. ఈ నిబంధన మీరినందున ఇన్ఫోసిస్‌కి జరిమానా విధించారు.

పార్కింగ్‌ ఫీజు ఇలా
తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌లో నిబంధనల ప్రకారం ఏదైనా షాపింగ్‌ కాంప్లెక్స్‌ లేదా మల్టీప్లెక్స్‌లో వాహనాన్ని 30 నిమిషాల నుంచి గంట వరకు నిలిపి ఉంచినప్పుడు ఆ భవనంలో కొనుగోలు చేసినట్టు ఏదైనా బిల్లు రిసీట్‌ చూపిస్తే పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ బిల్లు చేసినా పార్కింగ్‌ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇక గంట సమయాన్ని మించితే పార్కింగ్‌ ఫీజు కన్నా ఆ షాపింగ్‌ మాల్‌ లేదా మల్టీప్లెక్స్‌లో చేసిన బిల్లు ఎక్కువ ఉంటే పార్కింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

మరి వీటి సంగతి ?
పార్కింగ్‌ ఫీజు విషయంలో ఇన్ఫోసిస్‌ సంస్థ మీద చూపించిన శ్రద్ధ మిగిలిన షాపింగ్‌ కాంప్లెక్సుల మీద కూడా చూపెట్టాలని నగర వాసులు కోరుతున్నారు. నగరంలో చాలా షాపింగ్‌ మాల్స్‌లో అడ్డగోలుగా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు. బిల్లులు చూపించినా బెదిరింరి మరీ డబ్బులు గుంజుతున్నారు. పోచారం మున్సిపాలిటీ తరహాలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా పార్కింగ్‌ రూల్స్‌ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

చదవండి : ఆ రెస్టారెంట్‌లో సింగిల్‌ మీల్‌కు లక్షా ఎనభై వేలు.. విచిత్రమైన కారణం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top