
డెరివేటివ్స్ అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో సీఈవో సుమంత్ కథ్పాలియా రాజీనామాతో కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్‌ల కమిటీని బోర్డు నియమించినట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు లేదా మూడు నెలల వరకు ఈ కమిటీ ఉంటుందని పేర్కొంది. దీనికి బోర్డ్ చైర్మన్ సారథ్యం వహిస్తారు. ఆడిట్ కమిటీ, కాంపన్సేషన్, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ నుంచి సభ్యులు ఉంటారు. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో లెక్కింపులో తప్పుడు అకౌంటింగ్ విధానం కారణంగా బ్యాంకుపై సుమారు రూ. 1,960 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందనే అంచనాల నడుమ, నైతిక బాధ్యత వహిస్తూ సీఈవో మంగళవారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఏం జరిగిందంటే..
డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్‌ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్‌లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.
ఇదీ చదవండి: సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!
ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్‌ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్‌బీఐ ఆడిట్‌లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్‌బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి.