రిలయన్స్‌ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్‌ | IndianOil, Adani-Total, Shell lap up Reliance KG-D6 gas | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్‌

Apr 14 2023 4:32 AM | Updated on Apr 14 2023 4:32 AM

IndianOil, Adani-Total, Shell lap up Reliance KG-D6 gas - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌ నుంచి వెలికితీసే గ్యాస్‌ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), అదానీ–టోటల్‌ గ్యాస్, షెల్‌ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి.

రోజుకు 6 మిలియన్‌ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్‌ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్‌ గ్యాస్‌ 0.4 ఎంసీఎండీ, షెల్‌ 0.5 ఎంసీఎండీ, జీఎస్‌పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్‌ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్‌ ధర యూనిట్‌కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి.

అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్‌ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది.

Advertisement
 
Advertisement
Advertisement