breaking news
Gas sales
-
రిలయన్స్ కేజీ–డీ6 గ్యాస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ నుంచి వెలికితీసే గ్యాస్ విక్రయం కోసం నిర్వహించిన వేలానికి మంచి స్పందన కనిపించింది. వివిధ రంగాలకు చెందిన 41 కంపెనీలు వేలంలో పాల్గొనగా 29 సంస్థలు 5 ఏళ్ల కాలానికి గ్యాస్‌ను కొనుగోలు చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), అదానీ–టోటల్ గ్యాస్, షెల్ తదితర కంపెనీలు వీటిలో ఉన్నాయి. రోజుకు 6 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను విక్రయించగా ఐవోసీ దాదాపు సగభాగాన్ని (2.9 ఎంసీఎండీ) దక్కించుకుంది. గెయిల్ 0.7 ఎంసీఎండీ, అదానీ–టోటల్ గ్యాస్ 0.4 ఎంసీఎండీ, షెల్ 0.5 ఎంసీఎండీ, జీఎస్పీసీ 0.25 ఎంసీఎండీ, ఐజీఎస్ మరో 0.5 ఎంసీఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దిష్ట ఫార్ములా ప్రకారం గ్యాస్ ధర యూనిట్‌కు (ఎంబీటీయూ) 13.35 డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, సంక్లిష్ట ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ రేటును చెల్లించాల్సి ఉంటుందని వివరించాయి. ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఇది 12.12 డాలర్లుగా ఉందని తెలిపాయి. ఈ రేటును కేంద్రం 6 నెలలకోసారి సవరిస్తుంది. రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఈ జనవరిలోనే వేలం నిర్వహించాలని భావించినప్పటికీ జనవరి 13న కేంద్రం కొత్త ధరల విధానాన్ని ప్రకటించింది. దీంతో వేలాన్ని వాయిదా వేసుకుని, మార్చి 9 నుంచి నిర్వహించింది. -
25% తగ్గిన రాయితీ సిలిండర్ విక్రయాలు
న్యూఢిల్లీ: వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ బదిలీ (డీబీటీ) పథకాన్ని అమలు చేయడంవల్ల రాయితీ సిలిండర్ల విక్రయాలు సుమారు 25 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ గురువారం యూఎన్డీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. బోగస్ లబ్ధిదారులను వీలైనంతగా ఏరివేయడంవల్లనే ఇది సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు. డీబీటీని అమలు చేయడంవల్ల బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట వేయగలిగామని, దాంతో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల విక్రయాలు చాలావరకు తగ్గాయని ఆయన వివరించారు. 2014-15లో ఈ పథకంవల్ల రూ.12,700 కోట్లవరకు ఆదా చేయవచ్చని భావించామని, అయితే రూ.6,500 కోట్లమేరనే ఆదా చేయగలిగామని తెలిపారు.