India Ratings And Research: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!

Indian States To Moderate To 4.1percent Gdp  - Sakshi

ముంబై: రాష్ట్రాల ఆదాయాలు క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌ రా)తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు (ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.1 శాతానికి (రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో) పరిమితి కావచ్చని అంచనా వేసింది.

చదవండి: భారీగా పుట్టుకొస్తున్న సాస్‌ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్‌

ఇంతక్రితం వరకూ ఈ అంచనాను సంస్థ 4.3 శాతంగా పేర్కొంది. ఇక రాష్ట్రాల జీడీపీలో రుణ నిష్పత్తి కూడా 34 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలను వెలువరించింది. వ్యాక్సినేషన్‌ విస్తృత స్థాయిలో కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ కూడా ఊపందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. 

ఆయా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మెరుగుపడ్డానికి దోహపడతాయని పేర్కొంది. కరోనా ప్రేరిత మూడవ వేవ్‌ భయాలు తొలిగిపోతే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను ప్రభుత్వాలు మరింత సడలించే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనావేస్తోంది. ఆయా పరిస్థితుల్లో రెవెన్యూ లోటు క్రితం అంచనాలను కూడా 1.5 శాతం నుంచి (రాష్ట్రాల జీడీపీల్లో) 1.3 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. నివేదికకు సంబంధించి కీలక అంశాలను పరిశీలిస్తే.. 

2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 14 రాష్ట్రాల నుంచి అందిన సమాచారం విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో ఆయా రాష్ట్రాల ఆదాయం 30.8 శాతం పెరిగి రూ.3.95 లక్షల కోట్లకు చేరింది. 
 
2020 ఇదే కాలంలో పోల్చి చూసినా సమీక్షా కాలంలో వృద్ధిరేటు 1.5 శాతంగా ఉంది.  

 పన్ను, పన్నుయేతల ఆదాయాలు వరుసగా 77 శాతం, 46  శాతం చొప్పున ఎగశాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ రాష్ట్రాల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని భావించవచ్చు. 

రాష్ట్రాల స్థూల మార్కెట్‌ రుణాలు 2020–21లో రూ.7.88 లక్షల కోట్లు. 

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూలై మధ్య స్థూల మార్కెట్‌ రుణాలు రూ.1.94 లక్షల కోట్లు. 
 
 2020 ఏప్రిల్‌–జూలై మధ్య స్థూల మార్కెట్‌ రుణాలు రూ.2.1 లక్షల కోట్లు.  
 
అయితే 2020–21తో పోల్చితే స్థూల మార్కెట్‌ రుణాలు రూ.8.2 లక్షల కోట్లకు పెరుగే అవకాశం ఉంది. ఇది క్రితం క్రితం రూ.8.4 లక్షల కోట్ల అంచనాకన్నా తక్కువ.  
 ఇక నికర మార్కెట్‌ రుణాలు 2020–21లో రూ.6.45 లక్షల కోట్లుకాగా, ఇది 2021–22 నాటికి 6.2 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top