విదేశీ స్టాక్స్‌లో రికార్డు పెట్టుబడులు

Indian Investments In Foreign Stocks Property Touch Record High - Sakshi

2022లో 2.1 బిలియన్‌ డాలర్లు 

12 నెలల కాలంలో గరిష్ట స్థాయి ఇది

న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్నాయి. 2022లో విదేశీ సెక్యూరిటీలు, ప్రాపర్టీ, డిపాజిట్లలో భారతీయులు చేసిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో 2.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఒక 12 నెలల కాలంలో విదేశాల్లో భారతీయులు చేసిన అత్యధిక పెట్టుబడులు ఇవేనని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

విభాగం వారీగా చూసుకున్నా కానీ గతేడాది పెట్టుబడులు అత్యధికంగా ఉన్నాయి. ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాలకు పంపించుకోవచ్చు. విదేశీ యాత్రలు, విదేశీ విద్య, వైద్యం, పెట్టుబడులకు ఈ పరిమితి వర్తిస్తుంది. బహుమతులు, విరాళాలకూ ఇదే పరిమితి అమలవుతుంది.

2009కి ముందు 12 నెలల కాలంలో విదేశీ షేర్లు, ప్రాపర్టీలు, డిపాజిట్లలో భారతీయుల పెట్టుబడులు 350 మిలియన్‌ డాలర్లుగానే ఉండడం గమనించొచ్చు. 2022 డిసెంబర్‌తో అంతమైన 12 నెలల కాలంలో విదేశీ ఈక్విటీ లేదా డెట్‌లో పెట్టుబడులు రికార్డు స్థాయిలో 969.50 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. డిసెంబర్‌ నెల వరకే చూసుకున్నా ఇలా విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 120 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  

స్టాక్స్‌ పట్ల ఎక్కువ ఆసక్తి 
ముఖ్యంగా విదేశీ స్టాక్స్‌ పట్ల భారతీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ తదితర షేర్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంలో ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2022 డిసెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పోర్ట్‌ఫోలియోలో రూ.27,055 కోట్ల విలువైన విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉన్నాయి.

అది ఈ ఏడాది జనవరి చివరికి రూ.29,012 కోట్లకు వృద్ధి చెందింది. విదేశీ పెట్టుబడుల పరంగా మ్యూచువల్‌ ఫండ్స్‌కు కొన్ని నియంత్రణపరమైన పరిమితులు ఉన్నాయి. ఫండ్స్‌ విదేశీ పెట్టుబడుల విలువ అనుమతించిన గరిష్ట స్థాయికి చేరిపోవడంతో.. తాజా పెట్టుబడుల స్వీకరణను సెబీ నిలిపివేసింది.

పైగా విదేశాలకు పంపించే మొత్తం రూ.7 లక్షలకు మించితే మొదట్లోనే 20 శాతాన్ని టీడీఎస్‌ కింద మినహాయించాలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన విదేశీ పెట్టుబడులకు పెద్ద ప్రతిబంధకం అవుతుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే విదేశాలకు పంపించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top