2027లో 6.5 శాతం ఐఎంఎఫ్ అంచనా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్‌లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది.
ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు..
ఇరాన్ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్‌లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్ పేర్కొన్నారు.


