బైక్‌ ఎగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్‌..!

India Sets Record In Bike Exports - Sakshi

టూ వీలర్ల విక్రయాల్లో కొత్త రికార్డు 

భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో మే నెలలో కొత్త రికార్డు నమోదైంది. గత నెలలో భారత్‌ నుంచి 3,58,756 టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. దేశవ్యాప్తంగా 3,52,717 యూనిట్ల విక్రయాలు జరిగాయి. భారత చరిత్రలో తొలిసారిగా దేశీయంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఎగుమతులదే పైచేయి కావడం విశేషం. మే నెలలో భారత్‌లో 2,95,257 యూనిట్ల మోటార్‌ సైకిల్స్‌ అమ్ముడైతే.. 3,30,164 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేశారు. భారత్‌లో గత నెలలో ఉత్పత్తి అయిన టూ వీలర్లలో ఎగుమతుల వాటా అత్యధికంగా 57 శాతానికి చేరడం గమనార్హం. 2019 మే నెలతో పోలిస్తే పరిమాణం 22 శాతం ఎక్కువ. 2020 మే నెలలో పూర్తి లాక్‌డౌన్‌ ఉన్న సంగతి తెలిసిందే. 

కంపెనీల వారీగా ఇలా.. 
2021 మే నెల ఎగుమతుల్లో 83 శాతం వాటా టీవీఎస్‌ మోటార్, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ కంపెనీలు చేజిక్కించుకున్నాయి. బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలైతే వాటి ఉత్పత్తిలో సగానికిపైగా ఎక్స్‌పోర్ట్‌ చేశాయి. మహమ్మారి నేపథ్యంలో సొంత వాహనం ఉంటే సురక్షితం అన్న భావన ప్రజల్లో ఉండడం వల్లే వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోందన్నది తయారీ సంస్థల మాట. మధ్యప్రాచ్య దేశాల నుంచి డిమాండ్‌ అధికమైంది. దక్షిణాసియా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వర్కెట్లు రికవరీ కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమైంది. ఎగుమతుల స్థిర డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిమాణం పెరిగేందుకు దోహదం చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. 2020–21లో దేశం నుంచి 32,77,724 యూనిట్ల టూ వీలర్లు పలు దేశాలకు సరఫరా అయ్యాయి.

చదవండి: తగ్గిన ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల ధరలు..మోడల్‌ని బట్టి డిస్కౌంట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top