
2024–25లో 6.3 శాతం
జీడీపీపై ఇక్రా అంచనాలు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఫిబ్రవరిలో ప్రకటించిన అంచనాల కన్నా ఇది తక్కువ. 2024–25లో తొలి మూడు త్రైమాసికాల్లో నమోదైన 6.5 శాతం, 5.6 శాతం, 6.2 శాతం వృద్ధి ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ ఎన్‌ఎస్‌వో ఫిబ్రవరిలో ప్రకటించింది.
ఎన్‌ఎస్‌వో చెబుతున్న 6.5 శాతం స్థాయిలో వృద్ధి ఉండాలంటే మార్చి క్వార్టర్‌లో 7.6 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. క్యూ1 నుంచి క్యూ3 వరకు డేటాలో చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప వృద్ధి రేటు 6.3 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికం ప్రొవిజనల్ అంచనాలను ఎన్‌ఎస్‌వో మే 31న విడుదల చేయనుంది. టారిఫ్‌లపరమైన అనిశ్చితి కారణంగా క్యూ4లో ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనైనట్లు ఇక్రా వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది.