
2025 సంవత్సరం మొదలైందంటే 31.3.2025 నాటి కల్లా ప్లానింగ్, సేవింగ్స్, టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు... అలాగే 1.4.2025 దాటిదంటే రిటర్ను వేయడానికి సన్నద్ధం కావాలి. ఏ ఫారం వేయాలి. గడువు తేదీ ఏమిటి..? ఎంత పన్ను చెల్లించాలి..? ఇలా ఉంటాయి అందరి అలోచనలు. ఈ వారం టాక్స్ కాలంలో వ్యక్తులు ఏయే సందర్భాలలో రిటర్నులు వేయనక్కర్లేదో వివరంగా తెలుసుకుందాం.
టాక్స్‌బుల్ ఇన్‌కం లిమిట్ దాటని వ్యక్తులు నికర ఆదాయాన్ని టాక్స్‌బుల్ ఇన్‌కం అంటారు. నికర ఆదాయం టాక్సబుల్ ఇన్‌కం లిమిట్ లోపల ఉంటే రిటర్నులు వేయాల్సిన పనిలేదు. ఇది మీకు తెలిసిన విషయమే. కొత్త విధానంలో ఏ వయసువారికైనా బేసిక్ లిమిట్ రూ.3 లక్షలుగా ఉంటుంది. వయసు బట్టి మార్పు లేదు. కానీ పాత విధానంలో మార్పులు ఉన్నాయి. ఈ బేసిక్ లిమిట్ లోపల పన్నుభారం ఉండదు. అయితే కొత్త విధానంలో రిబేటుని ఇస్తారు. అంటే పన్ను భారంలోంచి తగ్గిస్తారు. ఆదాయంలోంచి కాదు. రిబేటుని రూ.60,000కు పెంచడం వలన రూ.12 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి పన్ను పడదు.
కేవలం బ్యాంకు వడ్డీ / పెన్షన్ ఉండి, ఎటువంటి టీడీఎస్ లేకపోతే...
మీ ఆదాయం కేవలం వడ్డీ అనుకొండి. సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఎఫ్‌డీలు కానీ లేదా పెన్షన్ కానివ్వండి లేదా ఈ రెండు కలిపి కానివ్వండి.. వెరసి మొత్తం టాక్సబుల్ ఇన్‌కం దాటకూడదు. అలాగే డివిడెండ్లు, టీడీఎస్ ఉండకూడదు. అటువంటి వారు నిశ్చింతగా ఉండొచ్చు. ఇదే ఉదాహరణలో టీడీఎస్ ఉంటే రిటర్ను వేయాలి.
గృహిణులు, విద్యార్థులు కూడా వేయనవసరం లేదు.
ఇంటి నిర్వహణ నిమిత్తం భర్త తన టాక్సబుల్ ఇన్‌కం నుంచి లేదా మిహాయింపు రశీదులో ఎంత ఇచ్చినా పన్ను పడదు. పోపుల డబ్బాలో మిగిలిన మొత్తానికి పన్ను ఉండదు. అలాగే పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీకి కూడా పన్ను పడదు.
ఎన్నారైలకు ఇండియాలో టాక్స్‌బుల్ ఇన్‌కం లిమిట్ రూ.2.50 లక్షల లోపల ఉంటే రిటర్ను వేయక్కర్లేదు.
సీనియర్స్ సిటిజన్లు... కానీ షరతులకు లోబడి సెక్షన్ 194 ... ఇదొక వరం లాంటిది. కానీ అందరూ లబ్ధిదారులు కాదు. 75 సంవత్సరాలు దాటిన వారికి వర్తిస్తుంది.
రెసిడెంటు అవ్వాలి
75 సంవత్సరాలు లేదా అంతకుపైబడిన వారికి మాత్రమే
ఆదాయంలో కేవలం పెన్షన్, ఒకే బ్యాంకు అకౌంటులోని వడ్డీ ఉండాలి.
ఒకే బ్యాంక్ అకౌంటు ఉండాలి. అది కూడా నిర్దేశిత బ్యాంకు అయ్యి ఉండాలి.
అందులోనే పెన్షన్ జమ అవ్వాలి
పెన్షన్+వడ్డీ మీద టీడీఎస్... ఆ బ్యాంకు లెక్కించి రికవరీ చేయాలి
బ్యాంకు 80 ఇ, 80 ఈ మొదలైన డిడక్షన్లు పరిగణలోకి తీసుకుంటుంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఈ వెసులుబాటు మాత్రం ఎంగిలి చేత్తో కాకిని తోలినట్లే కొద్ది మందికే ఉపయోగపడవచ్చు. దానిని వక్రీకరించి చాలామంది, 75 ఏళ్ల వారికి పన్ను లేదని పిడివాదన చేస్తుంటారు. అది నమ్మకండి.