వచ్చే 5 ఏళ్లలో భారత ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

India Electric Vehicle Market To Be Valued At Over 78 Billion Dollars By 2027 - Sakshi

గ్లోబల్‌ వార్మింగ్‌ సమస్యలను ఎదుర్కొవడం కోసం పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. అంతేకాకుండా కంపెనీలు కూడా పెట్రోల్‌, డిజీల్‌తో నడిచే సాంప్రదాయ వాహనాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రిక్‌ వాహనాలపై అడుగులు వేస్తున్నాయి.  మరోవైపు ఇంధన ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులు కూడా ప్రత్యామ్నాయాలపై చూస్తున్నారు. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. 

భారత ఈవీ మార్కెట్ల్‌పై దిగ్గజ కంపెనీల దృష్టి..!
దేశీయ కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా భారత ఈవీ మార్కెట్లపై దృష్టిసారించాయి. టెస్లా లాంటి కంపెనీలు భారత మార్కెట్లలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. భారత్‌లో అధిక దిగుమతి సుంకాలు ఉండడంతో పలు విదేశీ కంపెనీల రాక ఆలస్యమవుతోంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ కంపెనీ, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రధాన పోటీదారులగా నిలవనున్నాయి. లగ్జరీ కార్ స్పేస్‌లో...మెర్సిడెస్-బెంజ్ ఇండియా, ఆడి ఇండియా , జాగ్వార్ ఇండియా వంటి బ్రాండ్‌లతో పాటుగా బీఎండబ్ల్యూ,  వోల్వో కంపెనీలు కూడా భారత ఎలక్ట్రిక్ మార్కెట్లపై దృష్టిసారించాయి. 

వచ్చే 5ఏళ్లలో 78 బిలియన్‌ డాలర్లకు..!
రీసెర్చ్ అండ్ మార్కెట్స్ చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం... భారత ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ విలువ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి  సుమారు 78 బిలియన్‌ డాలర్లకు పైగా చేరుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విలువ 10 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి సాంకేతికతలో నిరంతర పురోగతి మరియు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌కు డిమాండ్‌ను పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. దక్షిణ భారతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై మరింత ఆదరణ ఉందని రీసెర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ వెల్లడించింది. 

గణనీయమైన వృద్ధి..!
ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్‌సైట్‌ల ప్రకారం...ఈ-స్కూటర్‌లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్‌సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్‌ డయల్‌ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై జస్ట్‌ డయల్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది.
చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు కేంద్రం శుభవార్త..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top